
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పిల్లలకు ప్రమాదకర దగ్గు సిరప్‌ను సూచించిన వైద్యుడిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ సోని సూచించిన దగ్గు సిరప్ తీసుకున్న 11 మంది చిన్నారులు మరణించిన ఉదంతం వివాదాస్పదంగా మారింది. పరాసియాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని తన క్లినిక్‌లో పలువురు చిన్నారులకు చికిత్స అందించిన దరిమిలా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్‌రిఫ్ సిరప్‌ను తయారు చేసిన శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై కేసు నమోదు చేసింది.
ప్రభుత్వం ఇప్పటికే కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఈ ఔషధ నమూనాలలో 48.6శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉంది. ఇది అత్యంత విషపూరితమైన పదార్థమని అధికారులు తెలిపారు. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలో ప్రభుత్వ ఔషధ విశ్లేషకులు ఈ సిరప్ నమూనాను పరీక్షించిన దరిమిలా తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ ‘కోల్డ్‌రిఫ్’ప్రామాణిక నాణ్యత లేనిదని ప్రకటించింది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు ప్రభుత్వం మరొక దగ్గు సిరప్ ‘నెక్స్ట్రో-డిఎస్’ అమ్మకాలను కూడా నిషేధించింది. కోల్డ్‌రిఫ్ పరీక్ష రిపోర్టు శనివారమే బయటకు రాగా, నెక్స్ట్రో-డిఎస్ నివేదిక రావాల్సివుంది.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారి చిన్నారులు తొలుత జలుబు, తేలికపాటి జ్వరంతో బాధపడ్డారు. ఈ సమయంలో వైద్యులు వారికి దగ్గు సిరప్‌తో సహా సాధారణ మందులు సూచించారు. ఆ తర్వాత వారు కోలుకున్నట్లు కనిపించినా, తిరిగి అవే అనారోగ్య లక్షణాలు కనిపించాయి. మూత్ర విసర్జనలో తేడా కూడా కనిపించింది. పరిస్థితి మరింతగా దిగజారి అది, కిడ్నీ ఇన్ఫెక్షన్‌గా మారింది. ఆ తరువాత వారు మృతిచెందారు. మృతుల కిడ్నీ బయాప్సీలో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ పదార్థం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ మరణాలు చాలా విషాదకరమైనవని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ అంతటా నిషేధించారని, సిరప్ తయారీ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధించనున్నామని ఆయన తెలిపారు.