కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా తెర వెనుక ఉండి ఎన్నికల వ్యూహాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబం ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగింది. మార్టిన్ కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త జోస్ చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన మార్టిన్ స్థానిక నాయకత్వంతో విభేదాల కారణంగా ఆ పార్టీకి స్వస్తి పలికారు. అనంతరం తన సేవా సంస్థ ‘జేసీఎం మక్కల్ మండ్రం’ను రాజకీయ పార్టీగా మార్చి 2025లో ‘లక్ష్య జననాయక కచ్చి’ (ఎల్‌జేకే)ని స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగానే ఉంది. కూటమి ఒప్పందంలో భాగంగా ఎల్‌జేకేకు కేటాయించిన రెండు స్థానాల్లో మార్టిన్ కామరాజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లింతోపు నియోజకవర్గంలో కూడా ఆయన నామినేషన్ వేసినప్పటికీ ఎన్నికల సంఘం కామరాజ్ నగర్ నామినేషన్‌ను ఆమోదించింది.
భారీ ఆస్తుల ప్రకటన
ఎన్నికల అఫిడవిట్‌లో మార్టిన్ సమర్పించిన వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రూ.597 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులతో ఆయన ఈ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు.
మొత్తం ఆస్తులు: రూ.597 కోట్లు
స్థిరాస్తులు (భూమి, భవనాలు): రూ.450 కోట్లు
నగలు: రూ.72 కోట్లు
వాచీలు: రూ.32 కోట్లు
వాహనాలు: రూ.2 కోట్లు
అప్పులు: రూ.210 కోట్లు
చార్లెస్ మార్టిన్‌కు తన తండ్రి స్థాపించిన ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్’ సంస్థలో 4.5 శాతం వాటా ఉంది. గతంలో ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా విరాళాలు ఇచ్చిన సంస్థగా ఇది వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
కుటుంబ రాజకీయాలు
మార్టిన్ కుటుంబం కేవలం పుదుచ్చేరికే పరిమితం కాలేదు. ఆయన తల్లి లీమా రోజ్ మార్టిన్ తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే టికెట్‌పై పోటీ చేస్తుండగా ఆయన బావ ఆధవ్ అర్జున ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉండటం విశేషం.


