సమోసాల కోసం రైలు ఆపిన లోకోపైలట్‌ | Loco pilot allegedly stopped a train to buy samosas near Indore | Sakshi
Sakshi News home page

సమోసాల కోసం రైలు ఆపిన లోకోపైలట్‌

Jul 9 2026 1:26 AM | Updated on Jul 9 2026 1:26 AM

Loco pilot allegedly stopped a train to buy samosas near Indore

ఇండోర్‌: రైలు సమయపాలన అస్సలు పాటించదని ఎంతో మంది ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయడం చూసే ఉంటారు. అయితే అనివార్యమైన కారణాలతో రైలు ఆలస్యమైతే నిట్టూర్చడం మినహా మనం చేసేదేమీ ఉండదు. కానీ మధ్యప్రదేశ్‌లో ఒక రైలు మార్గమధ్యంలో హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా ఆగడంతో అదే మార్గంలో తర్వాత రైళ్లలో వచ్చే ప్రయాణికుల్లో అసహనం పెరిగింది. తీరా ఆ ఆలస్యానికి కారణం కొన్ని సమోసాలు అని తెలిశాక ప్రయాణికుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆన్‌లైన్‌ వేదికగా ఆ లోకోపైలట్‌ చర్యను తప్పుబడుతూ, అతనిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

అసలేం జరిగింది?: మధ్యప్రదేశ్‌లోని రావూ రైల్వేస్టేషన్‌ సమీపంలో మార్గమధ్యంలో ఒక గూడ్స్‌ రైలు హఠాత్తుగా ఆగింది. దీంతో పట్టాలపై ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని డజను మంది స్థానికులు పరుగున వెళ్లి పరిశీలించారు. తీరాచూస్తే అక్కడేం లేదు. ఈలోపు ఇంజిన్‌ రూమ్‌ నుంచి ఒక అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కిందకు దిగి సమీప తినుబండారాల దుకాణానికి చకచకా వెళ్లి కొన్ని సమోసాలు, ఖచోరీలను కొనేసి ప్యాకెట్‌ వెంటబెట్టుకుని వెళ్లాడు. ఇదంతా సమీపంలోని ఒక వ్యక్తి వీడియోతీశాడు. అసిస్టెంట్‌ లోకో పైలట్‌ రైలు ఎక్కగానే అది వెంటనే ముందుకు కదిలింది. 

దీంతో రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం సమోసాలు కొనేందుకు దానిని ఆపారని అక్కడివాళ్లకు అర్థమైంది. దీంతో వెనకాల వచ్చే రైళ్ల సంగతి పట్టించుకోకుండా ఇష్టారీతిగా పట్టాలపై రైలును ఆపేసిన లోకో పైలట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు విన్పించాయి. దీనిపై వెస్టర్న్‌ రైల్వే బుధవారం తనదైన రీతిలో వివరణ ఇచ్చింది. ‘‘ సోషల్‌మీడియాలో ఆరోపించినట్లుగా అది ప్యాసింజర్‌ రైలు కాదు. గూడ్స్‌ రైలు. రావూ యార్డ్‌కు వెళ్తుండగా ముందున్న పట్టాల వద్ద ఇంజనీరింగ్‌ పనులు జరుగుతుండటంతో అధికారికంగా ఆదేశించిన మేరకే రైలు ఆ చోటన లోకోపైలట్‌ ఆపాడు. ఎలాగూ ఆగిందని సహాయక పైలట్‌ సమోసాలు కొనేందుకు వెళ్లివచ్చాడు’’ అని రత్లాం రైల్వే డివిజన్‌ అధికారి వివరణ ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement