
2024–25లో 2 కోట్లకుపైగా ఘటనలు నమోదు
దేశంలో 5 ఏళ్లలో నాలుగురెట్లు పెరిగిన పిడుగుపాట్లు
ప్రకృతి వైపరీత్య మరణాల్లో అధిక శాతం వీటి కారణంగానే
క్రమంగా నగరాలకూ విస్తరిస్తున్న ముప్పు ప్రాంతాలు
వర్షం పడుతోందంటే మెరుపులు, పిడుగులు పడడం సహజం. పిడుగు శబ్దం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో పడ్డా మన పక్కనే పడినట్టు ఉంటుంది. 2024–25లో ఇలా మనదేశంలో ఎన్ని పిడుగులు పడ్డాయో తెలుసా? 2 కోట్లకుపైగానే! అంటే రోజుకు సగటున 54,794! 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1,626 మంది మనుషులు, 52,367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10–12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగులకు అనువైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి.
బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగిందని, తూర్పు రాష్ట్రాల్లో తుపాన్లకు కారణమయ్యే తేమకు ఆజ్యం పోస్తున్నాయని క్లైమేట్ రెసీలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్‌ఓపీసీ) వ్యవస్థాపకులు సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది.
46 శాతం పిడుగుపాటు మరణాలే!
ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య వర్షాలు, పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 1,626 మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటుతో భారత్‌లో 1,01,000 మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్‌బీ) డేటా చెబుతోంది. 2002–24 మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు 46 శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఐఎండీ, సీఆర్‌ఓపీసీ ప్రకారం 2019–20లో 51.7 లక్షల పిడుగుపాటు సంఘటనలు నమోదయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య 2 కోట్లకుపైగా పెరిగింది.
ముందస్తు హెచ్చరికలు
ఐఎండీ ప్రస్తుతం 86 శాతం కచ్చితత్వంతో పిడుగులను అంచనా వేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అయిదు రోజుల ముందే హెచ్చరిస్తోంది. జిల్లాల పేర్లను రెండు రోజుల ముందుగా వెల్లడిస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నరోజున ప్రభావిత ప్రాంతాల వివరాలతో ప్రతి మూడు గంటలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఐఎండీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పిడుగులు అధికంగా పడే ప్రాంతాలను సీఆర్‌ఓపీసీ గుర్తించింది.
ముప్పు నివారణ ప్రణాళికలో భాగంగా దామినీ యాప్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంచాయతీ నియమించిన భద్రతా సమన్వయకర్తలకు రియల్–టైమ్ హెచ్చరికలను పంపుతున్నారు. జాతీయ పిడుగుపాటు నష్టనివారణ కార్యక్రమం కింద హెచ్చరికల కోసం మైక్రోఫోన్స్, సీసీటీవీ కెమెరాలు, లౌడ్‌స్పీకర్లతో కూడిన స్మార్ట్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లను నాటడం మొదలు అనేక అవగాహన ప్రచారాలు కూడా చేపట్టారు.
పట్టణ ప్రాంతాల్లోనూ..
నగరవాసులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి విద్యుదయస్కాంత మౌలిక సదుపాయాలను ఎక్కువగా వాడుతున్నారని ఇది పిడుగు ప్రమాదాన్ని పెంచుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెబుతున్నారు. కాంక్రీట్, తారు, గాజు వంటివి వేడిని గ్రహించి, ప్రసరింపజేయడం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం నగరాలను గ్రామీణ ప్రాంతాల కంటే వేడిగా మారుస్తోందట. ఈ పరిస్థితులు పిడుగుపాట్లకు దారితీస్తున్నాయట.
విమానయాన సంస్థలకు..
వర్షాకాలంలో పిడుగుపాట్ల వల్ల ఏటా దాదాపు 2,000 విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలకు ఏటా సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోందట.
