
న్యూఢిల్లీ: దేశంలో బాషా వివాదాలు నడుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో అవి తారాస్థాయికి చేరాయి. రాజకీయాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ బాషాభిమానం పొంగిపొర్లుతున్న వేళ.. అందుకు భిన్నంగా మాట్లాడిన గుజరాతీయులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్‌కు సంబంధించిన ఈ వీడియోలో గుజరాతీ బాష తెలియని వ్యక్తితో స్థానికులు హృదయపూర్వకంగా హిందీలో మాట్లాడటం కనిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ జై పంజాబీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అతను గుజరాత్‌కు చెందిన పలువురిని ఇంటర్వ్యూ చేశారు. ప్రతి ఇంటర్వ్యూ ప్రారంభంలో, తాను గుజరాత్‌లో నివసిస్తున్నప్పటికీ, తనకు గుజరాతీ బాష మాట్లాడటం రాదని, అర్థం చేసుకోలేనని అతను స్పష్టంగా చెబుతాడు.
ఈ సమయంలో అతను ఇంటర్వ్యూ చేసిన ప్రతీ ఒక్కరూ హిందీలో మాట్లాడేందుకు అంగీకరించారు. వారు హిందీలో మాట్లాడుతూ తమ రాష్ట్రానికి వచ్చే అతిథులకు గుజరాతీ రాకపోయినా, వారిని స్వాగతించడం గుజరాతీయుల విధి అని అన్నారు. మీకు గుజరాతీ తెలియదు కనుకనే తాము హిందీలో మాట్లాడుతున్నామని, లేనిపక్షంలో గుజరాతీలో మాట్లాడేవారిమని తెలిపారు. ఇతరులతో హిందీలో మాట్లాడేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని గుజరాతీయులు స్పష్టం చేశారు.