గిరిజన సమాజంపై ఆయనది చెరగని ముద్ర
‘మన్ కీ బాత్’లో ఆయన్నుస్మరించుకున్న ప్రధాని మోదీ
కొమురం భీమ్ గురించి యువత ఎక్కువ తెలుసుకోవాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల్లో కొత్త శక్తిసామర్థ్యాలను, స్ఫూర్తిని నింపిన ధీరుడు కొమురం భీమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ముఖ్యంగా గిరిజన సమాజంపై ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించారు. నెలవారీ మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతిని గుర్తుచేస్తూ ఆయన పోరాట స్ఫూర్తిపై మోదీ ప్రసంగించారు.
‘20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో కనుచూపుమేరలో స్వాతంత్య్రంపై నమ్మకం లేదు. బ్రిటిష్ పాలకులు భారత్‌ను దారుణంగా లూటీ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో దేశభక్తులు అత్యంత హేయమైన అణచివేతను ఎదుర్కొన్నారు. క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను భరించారు. పేదలు, అణగారిన, గిరిజన వర్గాలపై జరిగిన దురాగతాలకు అంతే లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు విధించారు.
ఇది అన్యాయని ఎదిరించిన వాళ్ల చేతులు నరికేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో దాదాపు ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఆ కాలంలో పెద్ద నేరం. అలాంటిది ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని సవాల్ చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి నిజాం సిద్ధిఖీని పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని అంతంచేశాడు.
అతను అరెస్ట్‌ను సైతం తప్పించుకోగలిగాడు. ఆ గొప్ప వ్యక్తే కొమురం భీమ్. అక్టోబర్ 22న ఆయన జయంతి చేసుకున్నాం. భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 ఏళ్లు మాత్రమే జీవించారు. నిజాం పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. అంతటి యోధుడి ప్రాణాలను 1940లో నిజాం సైన్యం బలిగొంది. ఇంతటి గొప్ప వీరుని సాహసాలు, గొప్పతనం ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయతి్నంచాలని ప్రజల్ని కోరుతున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. ‘‘నా వినమ్ర నివాళులు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని అన్నారు.
వందేమాతరం వేడుకలు
‘‘మనందరి హృదయాలకు దగ్గరైన ఒక గీతం గురించి మొదట మాట్లాడుకుందాం. అదే మన జాతీయగీతం వందేమా తరం. ఈ ఒక్క పదమే ఎన్నో భావోద్వేగాలను, ఉరిమే ఉత్సాహాలను తట్టిలేపుతుంది. భరతమాతతో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. వందేమాతర గీతా న్ని ఆలపించి 140 కోట్ల మంది ఐక్యశక్తిని చాటుదాం’’ అని మోదీ అన్నారు.
కమ్మని కోరాపుట్ కాఫీ
‘‘చాయ్‌తో నా అనుబంధం మీకు తెల్సిందే. కానీ ఈసారి కాఫీ విషయాలు మాట్లాడుకుందాం. గత మన్ కీ బాత్‌లో ఏపీలోని అరకు కాఫీ గురించి చర్చించాం. ఇప్పుడు ఒడిశా ప్రజలు ఎంతో ఇష్టపడే కొరాపుట్ కాఫీ కబుర్లు చెప్పుకుందాం. కోరాపుట్ కాఫీ ఘుమఘుమలు అద్భుతం. అంతేకాదు అక్కడి కాఫీ గింజల సాగు సైతం స్థానికుల ఆదాయాన్ని పెంచుతోంది. కోరాపుట్ కాఫీ ఎంతో స్వాదిష్టమైంది. అది ఒడిశా గౌరవం. అసలు భారతీయ కాఫీ అంటేనే ప్రపంచం దేశాలు పడిచస్తాయి’’ అని మోదీ అన్నారు.


