
కొచ్చి : కేరళలోని కొచ్చి వాటర్ మెట్రో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. వాటర్ మెట్రో ప్రారంభించిన 29 నెలల్లోనే 50 లక్షల ప్రయాణికులను గమ్య స్థానాలకు తీసుకెళ్లిందని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. ఈ 50 లక్షల మెలురాయి ప్రయాణికునిగా ఆస్ట్రేలియాకు చెందిన నైనా నిలిచారు.
శనివారం మధ్యాహ్నం ఫోర్ట్ కొచ్చికి ప్రయాణించేందుకు హైకోర్టు టెర్మినల్‌లో నైనా టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొచ్చి మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ లోక్‌నాథ్ బెహెరా నైనాకు ఒక బహుమతినిచ్చారు. పరిమిత సంఖ్యలో, రూట్లలో నడుస్తున్నప్పటికీ, వాటర్ మెట్రో సౌకర్యవంతమైన , అధిక నాణ్యత ప్రయాణ అనుభవాన్ని అందించడం కారణంగా ఈ విజయం సాధ్యమైందని బెహెరా పేర్కొన్నారు.
కేరళ ప్రభుత్వం ఏప్రిల్ 2023, ఏప్రిల్ 25న ప్రారంభించిన కొచ్చి వాటర్ మెట్రో స్థానికులతో పాటు పర్యాటకులలో ప్రజాదరణ పొందింది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రపంచ బ్యాంకు తన సంసిద్ధతను వ్యక్తం చేసిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కొచ్చి వాటర్ మెట్రో తన పనితీరు కారణంగా పలు అవార్డులను కూడా అందుకుంది. ప్రస్తుతానికి కొచ్చి వాటర్ మెట్రోలో హైకోర్టు, ఫోర్ట్ కొచ్చి, వైపీన్, బోల్గట్టి, ములవుకాడ్ సౌత్ చిత్తూరు, చేరనల్లూర్, ఎలంకుళం, వైట్టిల, కక్కనాడ్ సహా 10 టెర్మినల్స్‌లో 20 బోట్లు పనిచేస్తున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి రాత్రి 9 గంటల వరకు కొచ్చి వాటర్ మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు 125 ట్రిప్పులు తిప్పుతున్నారు. కొచ్చి వాటర్ మెట్రో ప్రారంభించిన 107 రోజుల్లోనే మొదటి 10 లక్షల మంది ప్రయాణికులు నమోదయ్యారు. ఆ తర్వాత 95 రోజుల్లో 20 లక్షలు, 185 రోజుల్లో 30 లక్షలు, 160 రోజుల్లో 40 లక్షల మంది నమోదయ్యాయి. తదుపరి 161 రోజుల్లో 50 లక్షల మంది ప్రయాణికుల రికార్డును చేరుకుందని సంబంధిత అధికారి తెలిపారు.