పొలిటికల్ థ్రిల్లర్​ను తలపిస్తున్న దోపిడీ కేసు

Kerala Highway Heist Korakada Allegations On BJP Turns Political Thriller - Sakshi

కేరళ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీజేపీకి ‘హవాలా మనీ’ ఆరోపణలు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. కార్యకర్తల స్థాయి నుంచి కీలక నేతల దాకా ప్రతీ ఒక్కరి మధ్య ఈ స్కామ్ చిచ్చుపెడుతోంది.  ఎన్నికలకు ముందు త్రిస్సూరు కొడకారా హైవేపై దోపిడి జరగడం.. ఈ కేసులో బాధితుడు ఫిర్యాదు చేసిన సొమ్ముకంటే ఎక్కువ సొమ్మును పోలీసులు రికవరీ చేస్తుండడం, ఆ సొమ్ముతో రాజకీయ నేతలకు లింకులు.. వెరసి పొలిటికల్​ థ్రిల్లర్​ మూవీని తలపిస్తున్నాయి అక్కడి రాజకీయాలు. 

త్రిస్సూరు: ఎన్నికల్లో గెలుపు కోసం కేరళ బీజేపీ డబ్బులు పంచాలని ప్రయత్నించిందని, కానీ బీజేపీ నేతలే ఆ డబ్బు కోసం దోపిడీ డ్రామాలు ఆడారనే ఆరోపణలు.. ప్రస్తుతం ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే ఇదంతా ఎల్​డీఎఫ్​(సీపీఐ-ఎం) రాజకీయ కుట్రలో భాగమేనని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ప్రభుత్వంతో కుమ్మక్కై పోలీసులు కుట్రకు పాల్పడుతున్నాయని ఆదివారం బీజేపీ పక్ష నేతలంతా మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలకు దిగారు.   ఈ సమావేశంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్​తో పాటు కేంద్ర మంత్రి మురళిధరన్​, పార్టీ మాజీ అధ్యక్షులు కుమ్మనం రాజేంద్రన్​, కృస్ణదాస్ ఇంకా సీనియర్​ నేతలు పాల్గొన్నారు. 

ఇలా మొదలైంది..
ఏప్రిల్​ 7న త్రిస్సూరుకు చెందిన షమ్జీర్​ శామ్​సుదీన్​ అనే వ్యక్తి కొడకారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఏప్రిల్​ 3న రాత్రి.. అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు రోజుల ముందు షమ్జీర్​ తన కారులో కొచ్చివైపు వెళ్తున్నాడు. ఆ టైంలో కొడకారా ఫ్లైఓవర్​ వద్ద తొమ్మిది మంది దుండగులు ‘ఫేక్​ యాక్సిడెంట్​’తో తనను ఆపారని, బెదిరించి ల్యాండ్ సెటిల్​మెంట్​ కోసం తీసుకెళ్తున్న పాతిక లక్షల రూపాయలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఒంటరిగా వెళ్లి ఫిర్యాదు చేయలేదు. అతని కూడా వ్యాపారవేత్త ఏకే ధర్మరాజన్​ కూడా ఉన్నాడు. ధర్మరాజన్​ ఆరెస్సెస్​ సభ్యుడు. ఆయన ఆ డబ్బును చాలామంది దగ్గరి నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పడం, సరిగ్గా దోపిడీ జరిగింది ఎన్నికల టైం కావడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. 

డొంక కదిలింది..
ఈ కేసులో దీపక్ అనే వ్యక్తి పోలీసులు మొదటగా అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారంతో ఈ దోపిడీలో పాల్గొన్న మరో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు పాతిక లక్షల కంటే ఎక్కువ సొమ్మును రికవరీ చేయడంతో అసలు ట్విస్ట్​ మొదలైంది. దీంతో పోలీసులు ధర్మరాజన్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. యువ మోర్చా నేత సునీల్​ నాయక్​ తనకు ఆ డబ్బు ఇచ్చాడని ధర్మరాజన్​ చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు సునీల్​ పిలిపించుకుని విచారించారు. తనకు ఆ డబ్బు బయటి నుంచి వచ్చిందని, ధర్మరాజన్​తో తనకున్న లావాదేవీల కారణంగానే ఆ డబ్బు ఇచ్చానని చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు మరోసారి ధర్మరాజన్​ను ఇంటరాగేషన్​ చేయడంతో.. ఆ సొమ్ము బీజేపీ నేతల కోసమేనని ధర్మరాజన్​ చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

బీజేపీతో లింకులు!
త్రిస్సూరులోని ఓ హోటల్​లో బీజేపీ కీలక నేత ఒకరు తనకోసం రూమ్​ బుక్​ చేశారని ధర్మరాజన్​ స్టేట్​మెంట్ ఇచ్చాడు. ఇది నిజమేనని ఒప్పుకున్న బీజేపీ కార్యదర్శి అనీష్​ కుమార్​.. కేవలం ప్రింటింగ్​ ఎలక్ట్రానిక్​ మెటీరియల్​ ఇంఛార్జిగా ఉన్న ధర్మరాజన్​ కోసం ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ సొమ్ము​ బీజేపీకి చెందిన మరో ముగ్గురు నేతలకు అందించాల్సి ఉందని ధర్మరాజన్​ చెప్పగా, వాళ్లు మాత్రం ఆ డబ్బుతో తమకేం సంబంధం లేదని పోలీసుల ఎదుట స్టేట్​మెంట్ ఇచ్చారు. ఇక ఈ కేసులో అరెస్టయిన దీపక్​.. దోపిడీ జరిగిన తెల్లారే బీజేపీ ఆఫీస్​కు వెళ్లాడన్న విషయం వెలుగులోకి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పైగా రికవరీ సొమ్ము దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనాకి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగప్రవేశంతో ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో కోటి రూపాయల దాకా సొమ్ము రికవరీ అయినట్లు తెలుస్తోంది. 

 సొంత నేతల పనేనా?
ఈ దోపిడీలో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్​.. దోపిడీ తర్వాత బీజేపీ ఆఫీస్​కు వెళ్లిన విషయాన్ని పార్టీ కూడా ధృవీకరించింది. అయితే దోపిడీకి సంబంధించి సొంత నేతలపైనే అధిష్టానానికి అనుమానం వచ్చిందని, ఆ కోణంలోనే దర్యాప్తు కోసం కొందరిని ఆఫీస్​కు పిలిపించుకున్నామని, అందులో కార్యకర్త దీపక్ కూడా ఉన్నాడని​ బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్​ చెప్పాడు. దీంతో ఈ దోపిడీ స్కెచ్​ బీజేపీలోని సొంత నేతల పనే అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు కొడాకరా దోపిడీ గురించి బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు వాట్సాప్​ గ్రూపుల్లో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసుకున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కేరళ బీజేపీలో అంతర్గత కుమ్ములాట వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అయితే ఈ కాంట్రవర్సీకి బీజేపీ కేరళ అధిష్టానం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే.. ఇదంతా ఎల్డీఎఫ్​ కుట్రలో భాగమేనని వాదిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పట్టుకోవాల్సింది పోయి.. బీజేపీ నేతలతో ముడిపెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణలను దిగింది. 

నిందితుల్లో లెఫ్ట్ నేత కూడా?!
పోలీసులు నిందితుల కాల్​ లిస్టులను పరిశీలించాల్సింది పోయి.. వ్యాపారవేత్త అయిన ధర్మరాజన్​ కాల్​ లిస్ట్​ను జల్లెడ పడుతోందని బీజేపీ మండిపడింది. ఈ కేసులో ఆరెస్ట్ చేయాల్సిన నిందితుడు మరోకడున్నాడని, అతను లెఫ్ట్​ పార్టీ యూత్ వింగ్​ లీడర్ మాత్రమే కాదని, త్రిస్సూరుకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ సురేంద్రన్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఆ నిందితుడు ఈ కేసు నుంచి తప్పించునేందుకు వామపక్ష  ఉద్యమవేత్త ఎన్​ఎన్​ పురం సాయం కూడా తీసుకున్నాడని చెప్పాడు. సీపీఎం నేత కొడియారి బాలకృష్ణన్​ కొడుకును బెంగళూరులో డ్రగ్స్​ ట్రాఫికింగ్​ కేసులో అరెస్ట్ చేయగా, ప్రతీకారంగానే తన కొడుకు హరికృష్ణన్​ను విచారణపేరుతో ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సురేంద్రన్ ఆరోపణలకు దిగారు.  

సిట్ ముందుకు నేతలు
కొడకారా దారి దోపిడీ కేసు వ్యవహారంలో కేరళ బీజేపీ కీలక నేతల్ని ప్రశ్నిస్తోంది సిట్​. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సురేంద్రన్​ ఎన్నికల టైంలో ఇద్దరికి లంచాల ప్రలోభం చూపెట్టాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆయన డ్రైవర్​తో పాటు ముఖ్య అనుచరుల్ని సిట్ ప్రశ్నించింది కూడా. ఇక సురేంద్రన్​ తనయుడు హరికృష్ణన్​.. దోపిడీ జరిగిన రోజు ధర్మరాజన్​తో పలుమార్లు ఫోన్​కాల్స్​ మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో హరికృష్ణన్​కు సిట్ నోటీసులు పంపింది. మరోవైపు బీజేపీ నేత, నటుడు సురేష్​ గోపీని కూడా(హెలికాఫ్టర్ల ప్రచారంపై) ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొడకారా కేసులో న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్​ పార్టీ​ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. 

ఈడీ దృష్టి
కొరకాడ హవాలా మనీ కేసు అని, ఇందులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ జోక్యం  చేసుకోవాలని కోరుతూ లోక్​తంత్రిక్​ జనతా దళ్​ యువ విభాగం జాతీయాధ్యక్షుడు సలీం మడావూర్​ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకుంటుందో లేదో తెలపాల్సిందిగా ఈడీ ఏజెన్సీని ధర్మాసనం కోరింది. అయితే ఈడీ వారం గడువు కోరగా.. కోర్టు పదిరోజుల గడువు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే ఈ కేసు ఫైల్స్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top