శబరిమల ‘స్వర్ణ కుంభకోణం’: సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం | Kerala High Court orders SIT probe over Sabarimala gold plating row | Sakshi
Sakshi News home page

శబరిమల ‘స్వర్ణ కుంభకోణం’: సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

Oct 6 2025 2:48 PM | Updated on Oct 6 2025 3:28 PM

Kerala High Court orders SIT probe over Sabarimala gold plating row

కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ఏర్పాటు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడంలో బంగారం బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్వర్ణ కుంభకోణం’పై ఏర్పాటైన సిట్‌కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తారు. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది.

సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో, గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను బయటికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదానికి బలం చేకూర్చే ఒక కీలక అంశాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడికి పంపిన ఒక ఈ మెయిల్‌ను కోర్టు పరిశీలించింది. శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల బంగారు పనులు పూర్తయిన తర్వాత తన వద్ద కొంత అదనపు బంగారు పలకలు  మిగిలాయని పొట్టి ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. ఈ ఈ మెయిల్  చూస్తుంటే పొట్టి వద్ద మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement