
గ్లోబల్ అయ్యప్ప సంగంలో కేరళ సీఎం విజయన్ వెల్లడి
పత్థనంతిట్ట: శబరిమల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా యాత్ర సజావుగా, సురక్షితంగా సాగేందుకు చర్యలు చేపడతామన్నారు. ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన గ్లోబల్ అయ్యప్ప సంగం కార్యక్రమంలో విజయన్ మాట్లాడారు. ప్రపంచ దేశాల నుంచి భక్తులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మదురై, తిరుపతి మాదిరిగా శబరిమలకు ప్రముఖ తీర్థయాత్రాస్థలంగా తీర్చుదిద్దుతామన్నారు.
శబరిమల, పంప, నీలక్కల్‌లతోపాటు అయ్యప్పస్వామి ఆలయానికి చేరుకునే మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, బీజేపీలను సీఎం విజయన్ విమర్శిస్తూ..దేనినీ ద్వేషించనివాడు, అందరితో స్నేహపూర్వకంగా, దయతో ఉండేవాడు, సుఖదుఃఖాల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు. సహనం కలిగి ఉండేవాడే నిజమైన భక్తుడని భగవద్గీతను ఉటంకించారు. భగవద్గీత నిర్వచించిన ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా భక్తులేనని ఆయన పేర్కొన్నారు. మిగతా వారు విశ్వాసులుగా నటిస్తూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకున్నందుకు సుప్రీంకోర్టుకు సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు. అన్ని మతాల వారు దర్శించుకునే శబరిమల కుల, మతాలకు అతీతమన్నారు. హరివరాసనమ్ గేయాన్ని లాలిపాటగా దేవరాజన్ మాస్టర్ స్వరపర్చగా క్రైస్తవుడైన ఏసుదాస్ పాడారన్నారు. అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఆయన సహచరుడిగా భావంచే వావర్‌కు అంకితం చేసిన మసీదు వావర్ నాడ మీదుగా వెళతారని సీఎం విజయన్ తెలిపారు. ఈ క్షేత్రం ప్రాశస్త్యం ప్రపంచమంతా తెలియాలంటే భక్తులను ఆకర్షించే విధంగా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. శబరిమల ఆలయ సముదాయమున్న సన్నిధానంను మూడు దశల్లో రూ.778కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.