కర్ణాటకలో ఇక పవర్‌ షిఫ్ట్! | Karnataka Congress power shift Siddaramaiah-DK Shivakumar CM race News | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఇక పవర్‌ షిఫ్ట్!

May 27 2026 6:37 AM | Updated on May 27 2026 8:36 AM

Karnataka Congress power shift Siddaramaiah-DK Shivakumar CM race News

కర్ణాటక అధికార కాంగ్రెస్‌లో నెలలుగా ఉత్కంఠ రేపుతున్న అధికారం పోరు చివరికి క్లైమాక్స్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై సాగిన సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ మధ్య అంతర్గత పోరుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో.. పార్టీ కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా డీకే శివకుమార్‌ పేరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం.

ప్రస్తుతం సీఎం‌గా ఉన్న సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమవుతున్నారని, ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో చర్చించిన ఆయన… “హైకమాండ్‌ నిర్ణయానికే కట్టుబడి ఉంటా” అని చెప్పినట్లు సమాచారం. కుదిరితే ఇవాళే లేదంటే గురువారం ఆయన రాజీనామా చేసే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. 

మరోవైపు.. డీకే శివకుమార్‌ అనుచరుల్లో ఆనందం ఆయన నాయకత్వంలోనే ఈ రెండేళ్లు ప్రభుత్వం నడవబోతుందా? అనే సంకేతాలిస్తోంది. ఇంతకు ముందు 2023 ఎన్నికల తర్వాతే “రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి” హామీ ఇచ్చారని డీకే వర్గం ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. ఇప్పుడు ఆ హామీ అమలు దశకు చేరిందని వారు భావిస్తున్నారు.

ఢిల్లీలో మంగళవారం జరిగిన ఆరు గంటల మారథాన్‌ సమావేశం తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వం ఈ పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. అధికారికంగా మాత్రం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించామని పార్టీ చెప్పినా, లోపల మాత్రం “పవర్‌ ట్రాన్స్‌ఫర్‌” ఫార్ములా ఫైనల్‌ అయినట్లు జాతీయ మీడియా చానెళ్లు కథనాలు ఇస్తున్నాయి. 

ఇక.. సిద్ధరామయ్య అనుచరుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోంది. “ఇంత ఈజీగా పదవి వదలొద్దు” అని కొందరు నేతలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్‌ ఉంటుందా? అనే ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.

సిద్ధరామయ్య వర్గాన్ని సమతుల్యం చేసేందుకు కొత్త ప్రభుత్వంలో పలువురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ అంతర్గత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అహిందా((A – Alpasankhyataru (మైనార్టీలు), HI – Hindulida Vargagalu, వెనుకబడిన వర్గాలు / OBCలు), DA – Dalitaru (దళితులు)) వర్గాల మద్దతు కోల్పోతామనే భయంతో ఇప్పటివరకు మార్పును వాయిదా వేసిన కాంగ్రెస్‌… తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి… కర్ణాటక కాంగ్రెస్‌లో “సిద్ధరామయ్య యుగం ముగిసి… డీకే శకం ప్రారంభమవుతుందా?” అనే చర్చ అటు కర్ణాటకతో పాటు ఇటు దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

జరిగింది ఇదే..

  • 2023లో జరిగిన “రొటేషనల్‌ సీఎం” హామీని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని డీకే వర్గం హైకమాండ్‌పై తీవ్ర ఒత్తిడి
  • ఢిల్లీకి చేరుకుని మంతనాలు జరిపిన డీకే శివకుమార్‌
  • సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి ఆకస్మిక పిలుపు
  • ఇద్దరితో భేటీ అయిన ఏఐసీసీ అగ్రనేతలు
  • రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా సిద్ధరామయ్యతో భేటీ 
  • రాష్ట్ర రాజకీయాల్ని వదిలి.. పెద్దన్న పాత్ర పోషించాలని సిద్ధూని కోరిన రాహుల్‌
  • “కర్ణాటకను దాటి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలి” అని సిద్దూకి సూచించిన రాహుల్‌ 
  • రాజ్యసభ సీటుతో పాటు ఢిల్లీలో జాతీయ స్థాయి బాధ్యతలు ఆఫర్‌ 
  • డీకే శివకుమార్‌ సీఎం పదవికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏకగ్రీవంగా గ్రీన్‌సిగ్నల్‌
  • సిద్ధరామయ్య వర్గాన్ని సంతృప్తిపర్చేందుకు కొత్త కేబినెట్‌లో ఆయన అనుచరులకు కీలక పదవులు
  • అసంతృప్తిని తగ్గించేందుకు ‘డిప్యూటీ సీఎంల ఫార్ములా’ను కూడా పరిశీలన 
  • సిద్ధరామయ్య కుమారుడు యతింద్రకు కీలక కేబినెట్‌ లేదంటే పార్టీ బాధ్యతలపై చర్చ 
  • 2028 కర్ణాటక అసెంబ్లీ, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే మార్పు అవసరమని భావిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు
  • అహిందా ఓటుబ్యాంక్‌ దూరం కాకుండా… సిద్ధరామయ్యకు “గౌరవప్రదమైన ఎగ్జిట్‌” ఇవ్వాలనే ఆలోచన
  • కేబినెట్‌ రీషఫుల్‌తో పాటు ప్రాంతీయ, కుల సమీకరణాలను బ్యాలెన్స్‌ చేసేలా కొత్త టీమ్‌

కొసమెరుపు.. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాత్రం “కర్ణాటక నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈరోజు సమావేశంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించాం” అంటూ ఇద్దరి సమక్షంలో అధికారిక ప్రకటన చేయడం.

Advertisement
 
Advertisement
Advertisement