కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు.. | Sakshi
Sakshi News home page

కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు.. సీఎం డిసైడయ్యేది ఆరోజేనా!

Published Sun, May 14 2023 6:49 PM

Karnataka Chief Minister Oath On Thursday Amid Suspense Over Name - Sakshi

బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్‌ ఆహ్వానం పంపింది.  

కాగా కర్ణాటకలో హంగ్‌ తప్పదనుకున్న ఊహాగానాలకు చెక్‌ పెడుతూ ఏకంగా 136 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. 43 శాతం ఓట్‌ షేర్‌ రాబట్టింది.  2018 ఎన్నికల్లో 104  స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. ఇక జేడీఎస్‌ కేవలం 19 సీట్లతో కుదేలైంది.
చదవండి: కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

సీఎల్పీ భేటీ
బెంగుళూరులో సీఎల్పీ సమావేశమైంది. షంగ్రిల్లా హోటల్‌కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ సహా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పార్టీ హైకమాండ్‌ దూతలను పంపింది. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ సుశీల్‌ కుమార్‌ షిండే, దీపక్‌ బబారియా, జితేంద్ర సింగ్‌ అల్వార్‌లను కర్ణాటక సీఎల్పీ సమావేశ పరిశీలకులుగా నియమించింది. సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్న షిండే బృందం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. అధిష్టానమే సీఎంను ప్రకటించాలని తీర్మానంలో నిర్ణయించారు. 

డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా
బెంగళూరులో డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ఇంటి ముందు ‘కర్ణాటక తదుపరి సీఎం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి.  ఇటు డీకే శివకుమార్‌ ఇంటి ముందు ‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఆయన మద్దతుదారులు పోస్టర్లు అంటించారు. ఇరు నేతల మద్దతుదారుల తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 137కు చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు.
చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement