ఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఆయన రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. పార్లమెంట్‌లో ఆయన అభిశంసన పెండింగ్‌లో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
కిందటి ఏడాది మార్చిలో యశ్వంత్ వర్మ ఢిల్లీ జడ్జిగా ఉన్న టైంలో.. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అప్పుడు ఆయన హోలీ సెలవుకు సొంతూరు వెళ్లారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఒకానొక టైంలో ఆయన ఇచ్చిన తీర్పులన్నింటిపైనా రివ్యూ జరగాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో..
న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో వెబ్‌సైట్‌లో కాలిన ఆ నోట్ల ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ముగ్గురు జడ్జిలతో కూడిన ఇన్‌హౌజ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయించింది. అటుపై దర్యాప్తు నేపథ్యంలో ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలాంటి వ్యక్తి తమకు వద్దంటూ ఆ టైంలో అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనలకు దిగింది. దీంతో ఆయనకు ఎలాంటి పని అప్పగించకుండానే ఖాళీగా కూర్చోబెట్టారు. మరోవైపు..
ఆయనపై పార్లమెంట్‌లో అభిశంసన ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈలోపు.. ‘సుప్రీం’ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపై రాజీనామా ఒత్తిడి పెరిగింది.
అయితే ఎప్పటికప్పుడు ఆయన వాటిని ఆరోపణలు తోసిపుచ్చుతూ వచ్చారు. కమిటీ నివేదిక.. అభిశంసన.. వీటి నుంచి బయటపడేందుకు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించగా.. అక్కడా ఆయన చుక్కెదురైంది. చివరకు స్వచ్చందంగా తన జడ్జి పోస్టుకి రాజీనామా చేశారు.
గతంలోనూ.. జస్టిస్ సౌమిత్ర సేన్ ( కలకత్తా హైకోర్టు) ఇంపీచ్‌మెంట్ ప్రక్రియ దగ్గరి దాకా వెళ్లి రాజీనామా చేశారు. జస్టిస్ పి.డి. దినకరన్ (సిక్కిం హైకోర్టు), జస్టిస్ వి. రమణ (మద్రాస్ హైకోర్టు) మాత్రం ఆరోపణలు రాగానే రాజీనామా చేసేశారు.


