డ్రైవింగ్‌ లైసెన్స్‌కు 30 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ | Jan Vishwas Bill Proposes 30 Day Grace Period After Expiry Of Driving Licence, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు 30 రోజుల గ్రేస్‌ పీరియడ్‌

Mar 28 2026 5:37 AM | Updated on Mar 28 2026 11:20 AM

Jan Vishwas Bill proposes 30-day grace period after expiry of driving licence

పార్లమెంట్‌ ముందుకు జన్‌ విశ్వాస్‌ బిల్లు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి పలు సవరణలను ప్రతిపాదించింది. డ్రైవింగ్‌ లైసెన్సును గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు అమల్లో ఉన్నట్లు పరిగణించడం వంటివి అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జన్‌ విశ్వాస్‌(అమెండ్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొవిజన్స్‌)బిల్లు–2026ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 23 శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు సంబంధించిన 784 నిబంధనల సవరణ ప్రతిపాదనలున్నాయి. ఇందులో మోటారు వాహనాల చట్టంలోని పలు నిబంధనల సడలింపు, చట్టపరమైన సందిగ్ధతను తొలగించేందుకు ఉద్దేశించిన 20 సవరణలున్నాయని మంత్రి జితిన్‌ ప్రసాద తెలిపారు. 

వాహన రిజిస్ట్రేషన్లను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకునేందుకు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే, పునరుద్ధరించిన తేదీ నుంచి అమలులోకి వచ్చేలా చేయడం వంటివి ఉన్నాయన్నారు. అదేవిధంగా, డ్రైవింగ్‌ లైసెన్సు గడువు ముగిసిన 30 రోజుల వరకు అమలయ్యేందుకు వీలు కల్పించామన్నారు. వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు కోసం దరఖాస్తు చేసుకునే గడువును 30 రోజులకు పెంచాలని, బీమా సర్టిఫికెట్‌ బదిలీపై సంబంధిత బీమా సంస్థకు సమాచారం ఇచ్చే గడువును కూడా 30 రోజులకు పెంచాలని ప్రతిపాదించామన్నారు. హిట్‌–అండ్‌–రన్‌ కేసుల్లో పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే, రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలుంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement