మావోయిస్ట్‌ అగ్ర నేత.. ప్రశాంత్‌ బోస్‌ కన్నుమూత  | Jailed Maoist strategist Prashant Bose passes away | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్‌ అగ్ర నేత.. ప్రశాంత్‌ బోస్‌ కన్నుమూత 

Apr 4 2026 5:15 AM | Updated on Apr 4 2026 9:10 AM

Jailed Maoist strategist Prashant Bose passes away

రాంచీ: జార్ఖండ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిషేధిత మావోయిస్ట్‌ పార్టీ అగ్ర నేత కిషన్‌ దా గా పరిచయమున్న ప్రశాంత్‌ బోస్‌ శుక్రవారం కన్నుమూశారు. 80ఏళ్లకు పైగా వయస్సున్న ఈయనకు మనీశ్, బుద్ధ అనే పేర్లు కూడా ఉన్నాయి. శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన ఆయన్ను జైలు అధికారులు వెంటనే రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)కు తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ప్రశాంత్‌ బోస్‌ తుది శ్వాస విడిచారని రాంచీ ఎస్‌ఎస్‌పీ రాకేశ్‌ రంజన్‌ తెలిపారు. మృతికి కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కొంతకాలంగా మధుమేహం, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. 

జార్ఖండ్‌లోని సెరాయ్‌కేలా–ఖర్సావన్‌ జిల్లాలో 2021 నవంబర్‌ 12వ తేదీన భార్య షీలా మరాండీతోపాటు ప్రశాంత్‌ బోస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌తోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర ఏడు రాష్ట్రాల పరిధిలో మావోయిస్ట్‌ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. జార్ఖండ్‌లోని దట్టమైన సారండా అడవుల్లో రహస్య జీవనం సాగిస్తూ 100కు పైగా దాడులకు ప్రశాంత్‌ బోస్‌ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత మావోయిస్ట్‌ పార్టీ కీలక విభాగాలైన సెంట్రల్‌ కమిటీ, పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌లలో ముఖ్యనేతగా ఉన్నారు. జార్ఖండ్‌ ప్రభుత్వం 2018లో ఈయన తలపై రూ.కోటి రివార్డు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి రివార్డులే ప్రకటించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement