కన్నా.. మరణంలోనూ నిన్ను వీడనురా! | Jabalpur Boat Accident: Mother Hug Son Viral | Sakshi
Sakshi News home page

కన్నా.. మరణంలోనూ నిన్ను వీడనురా!

May 1 2026 10:05 AM | Updated on May 1 2026 3:31 PM

Jabalpur Boat Accident: Mother Hug Son Viral

విహార యాత్ర కాస్త పెను విషాదాన్ని నింపింది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ నదిలో బోల్తా పడింది. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో గురువారం జరిగిన ప్రమాదంలో ఇప్పటిదాకా తొమ్మిది మృతదేహాల్ని వెలికి తీశారు. అయితే ఈ ఉదయం సహాయక చర్యలు తిరిగి ప్రారంభం కాగా.. ఆ సమయంలో కనిపించిన ఓ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. 

మృతదేహాలు వెలికి తీసే క్రమంలో ఓ మూటను సహాయక బృందాలు బయటకు లాగాయి. అందులో.. విగతజీవిగా మారిన తల్లీకొడుకులు కనిపించారు. ఆ తల్లి తన నాలుగేళ్ల కొడుకుని గట్టిగా తన కౌగిలిలో ఒడిసి పట్టుకుంది. వాళ్ల చుట్టూ చిరిగిపోయిన ఓ లైఫ్‌ జాకెట్‌ కట్టేసి ఉంది. ఆ దృశ్యం చూడగానే కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. 

సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రి రాకేష్‌ సింగ్‌ కూడా ఆ దృశ్యం చూసి కన్నీళ్లను దిగమింగుకున్నారు. బహుశా ఆ తల్లి తన కొడుకును కాపాడుకునేందుకు అలా కట్టేసుకుని ఉంటుందని సహాయక బృందంలోని ఓ అధికారి చెప్పారు. 

జబల్‌పూర్‌ బర్గి డ్యామ్‌లో సుమారు 40 మందికిపైగా పర్యాటకులతో వెళ్తున్న పడవ గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు 15 మందిని రక్షించగలిగాయి. గల్లంతైన వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కనిపించకుండా పోయిన వాళ్లలో అత్యధికంగా పిల్లలే ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: నో లైఫ్‌ జాకెట్స్‌, పట్టించుకోలేదు : బోట్‌ విషాదంలో సంచలన ఆరోపణలు

ఈ ఘటనలో పడవ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరిమితికి మించిన ప్రయాణికులను తీసుకెళ్లడం.. ఆ సమయంలో బలమైన గాలులు వీయడంతో పడవ మునిగిపోయినట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా ప్రమాణాలను సైతం పాటించలేదని.. పడవలో సరిపడా లైఫ్‌ జాకెట్లు లేవని తెలుస్తోంది. ఉన్న కొద్దిపాటి లైఫ్‌ జాకెట్లు కూడా డ్యామేజ్‌ స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement