
భారతీయ రైల్వే శివుని భక్తుల కోసం ఆధ్యాత్మిక యాత్రా అవకాశాన్ని అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ఇతర ప్రముఖ మతపరమైన ప్రదేశాలను కవర్ చేసే భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును నడుపుతున్నది.
నవంబర్ 18న యోగా సిటీ రిషికేశ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే 12 రోజుల ఈ తీర్థయాత్ర పర్యటన టిక్కెట్ ధర రూ. 24,100. ఈ రైలులో కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీ తరగతులు ఉంటాయి. ఈ యాత్రలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్, ద్వారకాధీష్ , బెట్ ద్వారకలను సందర్శించవచ్చు. అధికారిక IRCTC వెబ్‌సైట్ లేదా అధీకృత అవుట్‌లెట్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ధరలు: కంఫర్ట్ (2AC) ఒక వ్యక్తికి రూ. 54,390, స్టాండర్డ్ (3AC) ఒక వ్యక్తికి రూ. 40,890 ఎకానమీ (స్లీపర్): ఒక వ్యక్తికి రూ. 24,100గా చార్జీలు ఉండనున్నాయి.
భారత్ గౌరవ్ యోజన కింద ప్రయాణికులు 33 శాతం మేరకు టిక్కెట్ ధరలో తగ్గింపు పొందవచ్చు. బడ్జెట్ హోటళ్లలో వసతితో ఈ రైలు ప్రయాణం సాగనుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే) అందించనున్నారు. ప్రయాణ వ్యవధి: 11 రాత్రులు. టూర్ ప్రారంభ తేదీ: నవంబర్ 18, ముగింపు తేదీ: నవంబర్ 29. 767 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణించనుంది. ప్రయాణికులు బోర్డింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే తమ గుర్తింపు రుజువుతో పాటు COVID-19 టీకా సర్టిఫికేట్ తీసుకెళ్లడం తప్పనిసరిని ఐఆర్‌సీటీసీ తెలిపింది.