చొరబాటు.. ఎన్నికల అంశం కాదు | Infiltration a national security threat says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

చొరబాటు.. ఎన్నికల అంశం కాదు

Mar 31 2026 1:25 AM | Updated on Mar 31 2026 1:25 AM

Infiltration a national security threat says PM Narendra Modi

అది జాతీయభద్రతాంశం 

అస్సాంలో పరిస్థితిపై ప్రధాని మోదీ వ్యాఖ్య 

అస్సాం బూత్‌లెవల్‌ పార్టీ కార్యకర్తలతో వర్చువల్‌గా భేటీ

న్యూఢిల్లీ: అస్సాంను సమస్యగా పరిణమించిన చొరబాటు అంశాన్ని కేవలం ఎన్నికల్లో ప్రచారాంశంగా చూడొద్దని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాట్లు అనేవి దేశ పౌరుల గుర్తింపునకు, జాతీయ భద్రతకు గొడ్డలిపెట్టుగా తయారవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. మరో పది రోజుల్లో అస్సాంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని బూత్‌ స్థాయి బీజేపీ కార్యకర్తలతో ‘మేరా బూత్, సబ్‌సే మజ్‌బూత్‌ సంవాద్‌’కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు.

 ‘‘అస్సాంలో తొలిసారిగా ఓటేసే యువ ఓటర్లు రాష్ట్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల అసమర్థ పాలనలను ఒకసారి గుర్తుచేసుకోండి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేసినా మీరు చేసే ఈ తప్పు రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథం నుంచి పక్కకు తప్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టేలా బీజేపీ కార్యకర్తలు బాగా శ్రమించాలి. చొరబాట్లు అనేవి కేవలం ఎన్నికల అంశం కానేకాదు. అస్సాం రాష్ట్ర గుర్తింపు పరిరక్షణకు సంబంధించిన అంశమిది. చొరబాటుదారులు అక్రమంగా భూములను లాక్కునేలా కాంగ్రెస్‌ ప్రోత్సహించింది. చొరబాటుదారులు ఒక్కసారి రాష్ట్రంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారంటే అక్కడి చిరువ్యాపారాలను తమపరంచేసుకుంటారు. 

దాంతో స్థానికుల జీవనోపాధి కష్టమవుతోంది. ఆక్రమణను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తే బీజేపీ వాటిని అడ్డుకుంది. ఈశాన్య భారతంలో కేంద్రప్రభుత్వం శాంతిస్థాపన కోసం వేర్వేరు సంస్థలతో 12 శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది. అదే కాంగ్రెస్‌ ఒప్పందాలను కాగితాలకే పరిమితంచేసింది. కేవలం ఆర్భాటం చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కి ప్రజలను తప్పుదోవపట్టించింది. కాంగ్రెస్‌పాలనలో అస్సాం హింసతో రగిలిపోయింది. ఇప్పుడు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు శాంతిస్థాపనకు శతథా కృషిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ఏ ఒక్క శాంతి ఒప్పందం అమలుకునోచుకోలేదు. దీంతో యువత అశాంతితో రగిలిపోయారు. 

నాడు బోడోల్యాండ్‌లో కర్ఫ్యూలు కన్పించేవి. బాంబుమోతలు విన్పించేవి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు శాంతి, సుస్థిరత సాధించాయి. ఒకప్పుడు హింసను చవిచూసి నేడు శాంతిపథంలో దూసుకెళ్తున్న అస్సాం దేశానికే ఒక ఆదర్శదాయకం’’అని అన్నారు. ‘‘అస్సాం బీజేపీ కార్యకర్తలందరికీ ఇదే నా ఆహా్వనం. నేను కూడా మీలాగా కార్యకర్తనే. నాపై మోపిన బాధ్యతను నెరవేర్చా. నేడు ఏఐతో వచ్చే ఆడియో, వీడియో సందేశాలపై అప్రమత్తంగా ఉండండి. మీ అందరి వద్దా నమో యాప్‌ ఉండాలి. నారీశక్తి కోసం పార్టీ చేపట్టే చర్యల సమగ్ర వివరాలు యాప్‌ ద్వారా తెల్సుకుని ఓటర్లకు అవగాహన పెంచండి’’అని మోదీ సూచించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement