IND vs AUS కెప్టెన్ల ఫోటో షూట్‌: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం

INDvsAUS do you know Adalaj Stepwell where Rohit and cummins photoshoot took place - Sakshi

వరల్డ్ కప్ ఫైనల్‌  పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ  ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు  అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల  ఫొటో షూట్  ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్‌ ఎక్కడ? దీని వెనుక ఉన్న  కథ ఏంటి? తెలుసుకుందాం రండి..!

అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద  ఇరు జట్ల సారధులు  అదాలజ్‌ వావ్‌ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్‌ టూరిజం విభాఘం తమ ఎక్స్‌( ట్విటర్‌)లో  పోస్ట్‌ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్‌కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో  గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్‌లో మార్వాడీ భాషలో, స్టెప్‌వెల్‌ను ‘వావ్’ అంటారు.  ఇలాంటి  ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్‌ ని వావ్‌?

అదాలజ్‌ ని వావ్‌
అదాలజ్  ని వావ్ లేదా అదాలజ్ స్టెప్‌వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు.  ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్‌లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది.  తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో  ఉన్న పాలరాతి స్లాబ్‌పై  అదాలజ్ స్టెప్‌వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు.

భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం
పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది.  కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్‌పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్‌ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా,  బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో  ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది.  ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్‌వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి  పథకం వేరే ఉంటుంది.   ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది.  ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి  ఉన్నాయి.  

 ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే
సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్‌ఫారమ్‌లతో ఉంటుంది.  మూడు మెట్ల మార్గాలు  భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు.  

అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్‌లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది.  ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ  పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి  ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి.

 మేస్త్రీలకు మరణ శిక్ష
బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన  బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని  మేస్త్రీలని అడిగాడట. దానికి  సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు.  ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top