ఉక్రెయిన్‌లో వైద్య విద్యార్థి మృతి. వారినైనా కాపాడాలని తండ్రి ఆవేదన ఇదే..

Indian Student Naveen killed In Ukraine - Sakshi

తీవ్రశోకంలో విద్యార్థి కుటుంబం  

ఉక్రెయిన్‌ నుంచి నవీన్‌ భౌతికకాయం కోసం నిరీక్షణ  

పరామర్శల వెల్లువ 

శివాజీనగర(తమిళనాడు): తనయుడు డాక్టర్‌ అయి తిరిగి వస్తాడని అనుకుంటే విగతజీవిగా మారడంతో కుటుంబం తల్లిడిల్లిపోతోంది. కడసారి చూడాలని తపిస్తోంది. ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో మరణించిన హావేరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌ గ్యానగౌడర్‌ (22) కుటుంబానికి వెల్లువలా పరామర్శించారు. బుధవారం రాణి బెన్నూరు తాలూకా చళగేరి గ్రామంలో ఉన్న నవీన్‌ ఇంట్లో విషాద మౌనం ఆవరించింది. కుమారుడిని కోల్పోయి దిక్కు తోచక తండ్రి శేఖరగౌడ కూర్చొన్నారు. బంధుమిత్రులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకొన్నారు. ఇంటి ముందు నవీన్‌ ఫోటోను ఏర్పాటు చేయగా ప్రజలు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.  

ఇతర విద్యార్థులనైనా కాపాడండి: తండ్రి..  
తండ్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ, ప్రముఖులు తనతో మాట్లాడారని, తన కొడుకు ప్రాణాలతో రాలేదు, కనీసం ఇతర విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తాను మోదీని వేడుకొన్నట్లు చెప్పారు. మరణానికి ముందు తన కుమారుడు ఫోన్లో మాట్లాడేవాడని బంకర్‌లో ఉండడం కష్టం, బయటికి వచ్చినా కష్టమని చెప్పాడని, యుద్ధం జరగదని, ధైర్యంగా ఉండాలని కాలేజీవారు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడి రాజకీయం, రిజర్వేషన్, విద్యా విధానాలు సరిగా లేక తమ కుమారుడు ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి వచ్చిందని విలపించారు. భోజనాలకు తన వద్ద డబ్బు లేదు. డబ్బు వేయాలని కోరాడు, అదే ఆఖరి మాటైందని స్నేహితుడు శ్రీకాంత్‌ ఓ టీవీ చానల్‌కు తెలిపారు.

భౌతికకాయం తరలింపునకు చర్యలు: సీఎం..
ప్రస్తుతం ఖార్కివ్‌ నగరంలో నవీన్‌ మృతదేహం ఉండగా, అక్కడ నుండి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్‌ కుటుంబానికి పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై చెప్పారు. భౌతికకాయాన్ని తీసుకురావడం ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాగా మిగిలిన కన్నడిగులను వేగంగా వెనక్కి రప్పిస్తామని చెప్పారు.  

నా సోదరుడు రావడం లేదు..  
సమాజానికి ఏదో ఒకటి చేయాలని తన తమ్ముడు కలలు కన్నాడని, అతని వెంట వెళ్లినవారంతా వెనుతిరిగి ప్రాణాలతో వస్తున్నారు. అయితే తన తమ్ముడు రావడం లేదని మృతుడు నవీన్‌ సోదరుడు హర్ష రోదించారు.  
పేదల కలలపై నీట్‌ పిడుగు: కుమార  
పేద, మధ్యతరగతి వర్గాల మెడిసిన్‌ కలను నీట్‌  భగ్నం చేస్తోందని, ఇదే విద్యార్థుల, తల్లిదండ్రుల పాలిట మరణశాసనమైనదని మాజీ సీఎం హెచ్‌.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఉన్నత విద్యను సంపన్నులకు రిజర్వు చేసి పేదలకు వట్టి చేయి చూపుతున్నారని నవీన్‌ మరణాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు.  

కూతురు ఎలా ఉందో  
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగరకు చె ందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని మనీషా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. సాగర పట్టణం అణలెకొప్పలో ఉంటున్న జాన్‌ లోబో, త్రిజా లోబో దంపతుల కుమార్తె మనీషా కీవ్‌ నగరంలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. అక్కడ బంకర్‌లో తలదాచుకున్నట్లు మనీషా తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపింది. తమ కూతురు ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.  
కొడగు విద్యార్థిని  తిరిగి రాక.. 
దొడ్డబళ్లాపురం: ఉక్రెయిన్‌లో కొడగుకు చెందిన 16 మంది విద్యార్థులు చిక్కుకుపోగా గోణికొప్పలు గ్రామానికి చెందిన మదీనా (21) అనే విద్యారి్థని బుధవారం ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రుల సంతోషం అవధులు దాటింది. అలాగే 19 మంది బెళగావి జిల్లాకు చెందిన విద్యార్థుల్లో ఇద్దరు స్వదేశానికి తిరిగి వచ్చారు. మొత్తంగా కర్ణాటక విద్యార్థుల్లో 9 మంది బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీలో దిగిన విద్యార్థులు సాయంత్రం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకూ 64 మంది కర్ణాటకవాసులు తిరిగి వచ్చారు. ఉక్రెయిన్‌లో మొత్తం 693మంది కన్నడిగ విద్యార్థులు చిక్కుకున్నారని సమాచారం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top