దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం

India unemployment rate rises to 16-month high at 8. 30percent in December - Sakshi

డిసెంబర్‌లో 8.3 శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు  

న్యూఢిల్లీ: భారత్‌లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్‌లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మోనటిరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 2022 నవంబర్‌లో 8.96 ఉంటే, డిసెంబర్‌ వచ్చేసరికి 10.09 ­శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు నవంబర్‌లో 7.55% ఉంటే స్వల్పంగా తగ్గి డిసెంబర్‌ నాటికి 7.44శాతానికి చేరుకుంది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్‌ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి.  

కేంద్రానికి అతి పెద్ద సవాల్‌
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అదుపు చెయ్యడం, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం మోదీ సర్కార్‌ ముందున్న అతి పెద్ద సవాల్‌గా ఉంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తన పాదయాత్రలో కూడా అధిక ధరలు, నిరుద్యోగం సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగం రేటు మరోసారి పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. అయితే కరోనా భయాలు తొలగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్యం బాగా పెరిగిందని, ఇది నిజంగానే మంచి విషయమని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ వ్యాస్‌ చెప్పారు. గత ఏడాది కాలంలో ఉపాధి కార్మికులు భాగస్వామ్యం రేటు పెరిగి డిసెంబర్‌లో అత్యధికంగా 40.48% నమోదైందని ఆయన వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top