
ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ ఆగ్రహం
అమెరికాతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లను సమర్థించడంతోపాటు భారతీయుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేవలం బ్రాహ్మణులు లాభపడుతున్నారంటూ అమెరికా శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు పీటర్ నవారో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తీవ్రంగా ఖండించారు. నవారో వ్యాఖ్యలు అసంబద్ధం అంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడొద్దని నవారోకు సూచించారు.
భారత్–అమెరికా సంబంధాలు తమ ప్రభుత్వానికి చాలా అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు మధ్య సమగ్ర, ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలే పునాది అని స్పష్టంచేశారు. గతంలోనూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్–అమెరికా సంబంధాలు ఏమాత్రం దెబ్బతినలేదని తెలిపారు.
బలమైన ద్వైపాక్షిక అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై రెండు దేశాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలే ఆధారంగా భారత్–అమెరికా అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు రణదీర్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉన్నాయని చెప్పారు. కీలక అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.