సైప్రస్‌తో సుదృఢ బంధం  | India-Cyprus elevate ties to strategic partnership | Sakshi
Sakshi News home page

సైప్రస్‌తో సుదృఢ బంధం 

May 23 2026 5:02 AM | Updated on May 23 2026 5:02 AM

India-Cyprus elevate ties to strategic partnership

భారత్, సైప్రస్‌ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం  

రక్షణ సహకారంలో ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ ఆవిష్కరణ  

ప్రధాని మోదీతో సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ భేటీ  

ఆరు ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు

న్యూఢిల్లీ: భారత్, సైప్రస్‌ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఇరుదేశాలు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాయి, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. రక్షణ సహకారం విషయంలో ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి తదితర రంగాల్లో సహకారం కోసం ఇరుదేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఒప్పందం కూడా ఇందులో ఉంది. వలసలపై ఒక సమగ్ర భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, సైప్రస్‌ నిర్ణయించుకున్నాయి.  

కాలపరీక్షకు నిలిచిన స్నేహబంధం  
వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, విద్య వంటి రంగాల్లో సంబంధాలతోపాటు ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ అమలుపై నరేంద్ర మోదీ, నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌ చర్చించుకున్నారు. ఈ భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సైప్రస్‌లోని మౌలిక సదుపాయాలు, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో భారతీయ కంపెనీలకు వాణిజ్య మూలధనాన్ని అందుబాటులోకి తెచ్చి, కొత్త మార్గాలను తెరుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న షిప్పింగ్, సముద్ర పరిశ్రమల్లో పెట్టుబడులను పెంచుతుందని వెల్లడించారు. ‘భారత్, సైప్రస్‌ స్నేహబంధం ఎన్నోసార్లు కాలపరీక్షలకు నిలిచిందని గుర్తుచేశారు. 

ఈ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలన్న నిర్ణయంతో ఇరుదేశాల బంధానికి కొత్త ఆశయాలను, కొత్త ఊపును ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అలాగే సైబర్‌ సెక్యూరిటీ డైలాగ్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు రెండు దేశాలు ప్రకటించాయి. భారత్‌–యూరప్‌ సంబంధాలు మెరుగుపడటాన్ని మోదీ ప్రస్తావించారు. అవి ఒక కొత్త స్వర్ణయుగంలోకి ప్రవేశించాయని అన్నారు. మౌలిక సదుపాయాలు, నౌకా రవాణా వంటి కీలక రంగాల్లో సహకారం కోసం భారత్, సైప్రస్‌లు ఒక సంయుక్త      టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని నికోస్‌ క్రిస్టోడౌలైడ్స్‌ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో యూరోపియన్‌ యూనియన్‌     (ఈయూ), భారత్‌ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement