దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువు
సాక్షి, చెన్నై: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ తమ బీఎస్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పూర్తి చేసిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి వయోపరిమితి లేదని ప్రకటించింది.
సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లా కాకుండా, దీనికి జేఈఈ స్కోరుతో సంబంధం లేదని వివరించింది. అభ్యర్థులు ‘క్వాలిఫైయర్ ప్రాసెస్’ ద్వారా నేరుగా అడ్మిషన్ పొందవచ్చని, ప్రస్తుతం నాలుగు విభాగాల్లో ఈ బీఎస్ డిగ్రీలను అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, బీఎస్ ఇన్ ఎల్రక్టానిక్ సిస్టమ్స్, బీఎస్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్, బీఎస్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్టు తెలిపారు.
ఈ కోర్సులను రెగ్యులర్ కాలేజీ డిగ్రీ చదువుతూనే సమాంతరంగా పూర్తి చేయవచ్చని వివరించారు. తరగతులు ప్రధానంగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతాయని, పరీక్షలు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో నేరుగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అవసరాన్ని బట్టి సర్టిఫికెట్, డిప్లొమా, లేదా పూర్తి డిగ్రీ పొంది ఏ దశలోనైనా కోర్సు నుంచి వైదొలగవచ్చునని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఫీజులో 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో, మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌కు దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు మే 2026 సెషన్ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 13 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే ఇంటర్ విద్యశాఖలో లైబ్రరీ సైన్స్ జూనియర్ లెక్చరర్ (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలకు https://psc.ap.gov.in/లో చూడవచ్చు.
చదవండి: గుడులు, లాకర్లలో బోలెడంత బంగారం..
ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 740 మంది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 11 నెలల వ్యవధికి రెన్యూవల్ చేశారు. 2026–27కి ఒక నెల విరామంతో అవకాశం ఇస్తున్నామని, పనిచేయకపోతే జీతం లేదనే షరతుతో పునరుద్ధరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


