బాల్కనీ నుంచి జారి పడి దుర్మరణం
భువనేశ్వర్: ఐఐటీ భువనేశ్వర్ క్యాంపస్‌లో ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారి పడి పీహెచ్‌డీ విద్యార్థి మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్యాంపస్‌లో విషాదం అలముకుంది. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన తనికొండ నిశాంత్ కుమార్‌గా గుర్తించారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు ప్రాంతానికి చెందిన వాడు. నిశాంత్ హాస్టల్ బ్రహ్మపుత్ర హాల్ ఏ బ్లాక్ 6వ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులకు తెలియజేయడంతో తక్షణమే క్యాంపస్‌లోని సంజీవన్ ఆస్పత్రికి తరలించారు.
అత్యవసర వైద్యం చేసి ఉన్నత చికిత్స కోసం ఐఐటీ అంబులెన్స్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం పరీక్షించి విద్యార్థి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించింది. క్యాంపస్ అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జట్నీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పంచనామా ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు.


