‘మిషన్‌ త్రిశూల్‌’తో ఎన్‌డీఏ విజయం? | How RSS's ‘Mission Trishul’ powered NDA’s sweep | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ త్రిశూల్‌’తో ఎన్‌డీఏ విజయం?

Nov 15 2025 9:34 AM | Updated on Nov 15 2025 11:15 AM

How RSS's ‘Mission Trishul’ powered NDA’s sweep

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమికి నిర్ణయాత్మక విజయం అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరించిన ‘మిషన్‌ త్రిశూల్‌’ అమోఘంగా దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) తన పనితీరుతో ఎన్‌డీఏకు నిశ్శబ్ద ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది.

బీహార్‌ ఎన్నికలకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యక్ష పర్యవేక్షణలో  ‘మిషన్‌ త్రిశూల్‌’ చేపట్టారు. 2025, ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రచారంలో బీహార్ అంతటా 50 వేల నుండి 60 వేల సమావేశాలను నిర్వహించారు. అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో 200 నుంచి 300 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో కేవలం రాజకీయ ప్రచారం చేయడమే కాకుండా, లోతైన  సర్వేలు, ఓటర్ల సమీకరణపై దృష్టి సారించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, బజరంగ్ దళ్, వీహెచ్‌పీ, మజ్దూర్ సంఘ్ తదితర  సంస్థలు ఈ సమన్వయ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి.

మూడు దశల త్రిశూల్‌ వ్యూహం
‘మిషన్ త్రిశూల్’ ప్రధానంగా మూడు దశల వ్యూహంగా రూపొందింది. ఇది సంప్రదాయ ఎన్నికల ప్రచారాలకు భిన్నంగా సాగింది.

అసంతృప్త ఓటర్లను గుర్తించడం 
ఆర్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛంద సేవకులు.. అట్టడుగు స్థాయిలో సర్వేలు నిర్వహించి, స్థానిక సమస్యలైన నిరుద్యోగం, అభివృద్ధి కుంటుబాటు, మౌలిక సదుపాయాలలో లోపాలు, స్థానిక పాలన అంతరాల విషయంలో నిరాశ చెందిన ఓటర్లను గుర్తించారు. వారి ఫిర్యాదులను డాక్యుమెంట్ చేసి, పరిష్కార మార్గాలను బీజేపీ వేదికగా ప్రచారం చేశారు.

స్థానిక,జాతీయ సమస్యలపై దృష్టి
ఈ మిషన్‌లో జీవనోపాధి, ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభం, కుల ఆధారిత రిజర్వేషన్ల వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఈ సమస్యలను బీజేపీకి చెందిన విస్తృత జాతీయవాదం, అభివృద్ధి కథనాలతో సమర్థవంతంగా అనుసంధానించారు. తద్వారా స్థానిక, జాతీయ దృష్టికోణాల మధ్య సమతుల్యత సాధించారు.

గుర్తింపు ఆధారిత విధానం
ఈ వ్యూహంలోని అత్యంత కీలకమైనది  ‘గుర్తింపు ఆధారిత విధానం’.. జాతీయవాద గొడుగు కింద ఉన్న వివిధ హిందూ సమూహాలను ఏకం చేయడం దీని లక్ష్యం. ఇది ముస్లిం-యాదవ్ (ఎంవై) వంటి సంప్రదాయ ప్రత్యర్థి ఓటు సమూహాలలో మార్పులను సృష్టించి, ఎన్‌డీఏకి మద్దతు పెంచడంలో కీలక పాత్ర పోషించింది. స్వచ్ఛంద సేవకులు ప్రతి బూత్‌ను విశ్లేషించి, చివరి నిమిషంలో ఓటర్ల సమీకరణ ప్రయత్నాలను తీవ్రం చేశారు. ఇది ఓటింగ్ సరళిని స్పష్టంగా మార్చింది.

తదుపరి లక్ష్యం.. పశ్చిమ బెంగాల్ 2026
బీహార్‌లో ‘మిషన్ త్రిశూల్’ సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన తదుపరి లక్ష్యంగా 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎంచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాన్ని పదునుపెట్టే పనిలో పడింది. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక స్తబ్దత తదితర అంశాలను ప్రధానంగా హైలైట్ చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక వేస్తోంది. అలాగే మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో హిందూ ఏకీకరణను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాలు, ‘ఘర్ వాపసీ’ వంటి కార్యక్రమాలను  చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది. బీహార్‌లో విజయానికి దోహదపడిన ఈ నిశ్శబ్ద సైద్ధాంతిక విస్తరణ వ్యూహాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మరిన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు అమలు చేయనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement