
1947లో 45 శాతం హిందువులు ఉండేవారు
ముస్లింల జనాభా ప్రస్తుతం 85 శాతానికి చేరింది
గత ఏడాది జరిగిన హింసాకాండపై త్రిసభ్య కమిటీ నివేదికలో వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇటీవల సమర్పించింది. 450 పేజీల ఈ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 2024 నవంబర్ 24న జరిగిన హింసతోపాటు దాని పూర్వాపరాలు వెల్లడించింది. సంభాల్‌లో హిందువుల జనాభా 15 శాతానికి పడిపోయినట్లు స్పష్టంచేసింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ జనాభా స్థితిగతుల్లో భారీ మార్పులు వచ్చాయని, మత రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడంతో పట్టణంలో గత ఏడాది హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మసీదు ప్రాంగణంలో గతంలో హిందూ ఆలయం ఉండేదని పేర్కొంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు.
సర్వే కోసం వచ్చిన బృందంతో కొందరు నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. ఇది క్రమంగా తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాళ్ల దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలను నిరసనకారులు దహనం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవేంద్ర ఆరోరా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికలోని అంశాలివీ...
సంభాల్‌లో 1947 తర్వాత 15సార్లు ఘర్షణలు జరిగాయి. 1947, 1948, 1953, 1958, 1962, 1976, 1978, 1980, 1990, 1992, 1995, 2001, 2019, 2024లో హింసాకాండ చోటుచేసుకుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంభాల్‌లో హిందువులు 45 శాతం, ముస్లింలు 55 శాతం ఉండేవారు. ఇప్పుడు హిందువుల జనాభా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. ముస్లింల సంఖ్య 85 శాతానికి చేరుకుంది. తరచుగా జరుగుతున్న ఘర్షణలు, బుజ్జగింపు రాజకీయాలు ఇందుకు దోహదం చేశాయి.
2024 నవంబర్ 22న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ చేసిన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సంభాల్‌లో ఘర్షణ మొదలైంది. నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో ఘర్షణలు విస్తరించలేదు.
అల్–ఖైదా, హర్కత్–ఉల్–ముజాహిదీన్ తది తర ఉగ్రవాద సంస్థలకు సంభాల్‌లో గతంలో స్థావరాలు ఉండేవి. ఇక్కడ ఆక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల ముఠాలకు కొదవలేదు.
సంభాల్‌లో 68 పుణ్యక్షేత్రాలు, 19 పవిత్ర బావులు ఉండేవి. అవి చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి.