
హై క్యాలరీలు, అధిక చక్కెరల ఆహారంతో చేటు
మద్యపానంతో కాలేయానికి మరింత ముప్పు
వ్యాయామం, జీవనశైలి మార్పులతో నివారణ
మీకు పొట్ట కాస్తో కూస్తో లేదా బాగా ముందుకు వచ్చో కనిపిస్తోందా? ఇలా పొట్ట ముందుకు వస్తే మొదట చూసుకోవాల్సింది కాలేయాన్ని! ఎందుకంటే.. పొట్ట పెరగడమన్నది ‘ఫ్యాటీ లివర్’ సమస్యకు ఒక సూచన కావచ్చు. అంటే కాలేయంలో క్రమక్రమంగా కాలేయ కణాల స్థానే కొవ్వు కణాలు వచ్చి చేరడం. ఈ ‘ఫ్యాటీ లివర్’.. డయాబెటిస్, రక్తపోటు లాగే ఓ జీవనశైలి (లైఫ్‌స్టైల్) సమస్య. ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. భవిష్యత్తులో పూర్తిగా కొవ్వు కణాలతో నిండిపోయి.. ఒక దశలో చివరి స్టేజ్ లివర్ డిసీజ్, లివర్ కేన్సర్‌కూ దారితీసే ముప్పునూ తప్పించుకోవచ్చు.
ఫ్యాటీ లివర్ అంటే...
మన పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ మనం చేసే శారీరక శ్రమలో దహించుకుపోయినవి తప్ప మిగతావన్నీ కొవ్వు రూపంలో కాలేయంలోనే నిల్వ అవుతుంటాయి. ఇలా చక్కెరలు పెరగడమూ, శారీరక శ్రమ తగ్గడంతో క్రమంగా కాలేయంలో కొవ్వు కణాలు పెరిగిపోయి కాలేయ కణాలు తమ సహజ గుణాన్ని కోల్పోతాయి. ఆరోగ్యకరమైన లివర్ కాస్తా కొవ్వు పేరుకుపోతున్న ఫ్యాటీలివర్ కండిషన్ గా మారిపోతుంది. ఇలా కాలేయకణాలను కోల్పోతూ... కొవ్వుకణాలను నింపుకొంటున్న కండిషన్ నే ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయం 90 శాతం దెబ్బతినేవరకు తనకు సంబంధించిన లక్షణాలను బయటపడనివ్వదు. అంతేకాదు... జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ తనను తాను బాగుచేసుకోనూ గలదు.
కారణాలేంటి?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం పెరిగింది. చక్కెర మోతాదులు చాలా ఎక్కువగా ఉండే వాటినీ తింటున్నారు. ఆ క్యాలరీలను దహించడానికి మాత్రం ఎలాంటి వ్యాయామాలూ చేయడం లేదు. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలూ, వృత్తులతో కూర్చుని కూర్చుని పొట్ట పెరుగుతోంది. మరికొందరికి మద్యపానం అలవాటు. ఇలాంటి జీవనశైలి మార్పులతో స్థూలకాయం, మధుమేహంతోపాటు ఫ్యాటీలివర్ కూడా చాలామందిలో కనిపిస్తోంది.
ఇవీ గ్రేడ్స్..: ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రతను బట్టి ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కొంత నిరుపాయకరమని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. జీవనశైలిని మెరుగుపరచుకుంటూ ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ అలవరచుకుని కొంత క్రమశిక్షణతో మెలగడం, వ్యాయామం చేయడం ద్వారా మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ను అదుపులో పెట్టవచ్చు. మూడో గ్రేడ్, ఆపైన గ్రేడులకు చేరితే కాలేయమార్పిడి తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు.
మొదటి దశ: ఇది సాధారణ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొవ్వు చాలా పరిమితంగా ఉంటుంది.
రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్ ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి.
మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోయి, గట్టిపడుతుంది.
నివారించగల కారణాలు
మద్యపానం చేసేవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ అలవాటును మనం ప్రయత్నపూర్వకంగా పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. ఇక వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకోవడమూ మన చేతుల్లో ఉన్నదే. అధిక రక్తపోటు ఉన్నవారు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అధిక మోతాదులో మందులు వాడకాన్ని నివారించాలి. వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి.
నివారించుకోలేని కారణాలు
నివారించుకోలేనంత బరువు పెరగడం అన్నది మన చేతుల్లో ఉండదు. పొట్ట బాగా ముందుకు వచ్చినవాళ్లలోనూ, స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలోనూ మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో రెండో దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో ఎక్కువ శాతం మందిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇవీ లక్షణాలు
తొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంటే ఫ్యాటీలివర్ ఉనికి తెలుస్తుంది.
⇒ కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్‌కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరగడమే ఇందుకు కారణం.
క్యాన్సర్ ముప్పు కూడా...
ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా కొందరిలో లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు.
నివారణ ఇలా : బరువు నియంత్రించుకోండి : మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) అనుగుణంగా శరీర బరువును నియంత్రించుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారం : ఆహారంలో తప్పనిసరిగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. మాంసాహారంలో రెడ్‌మీట్‌కు బదులు మెత్తని మాంసంతో (లీన్) కూడిన చికెన్, చేపలు వంటివి తీసుకోవాలి. వంటల్లో నూనె వాడకం తగు మోతాదులో ఉండాలి. పొట్టుతీయని తృణ ధాన్యాలు ఎక్కువగా వాడాలి.
⇒ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి
⇒ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి.
వ్యాయామం : ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.
చికిత్స
⇒ ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి.
⇒ చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
⇒ బాధితులు వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిందేమో చూసుకోవాలి. అవసరమైతే డాక్టర్లు మందులను మారుస్తారు.
చివరిగా.. ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో చికిత్స కంటే నివారణ మేలు.