పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు

Govt issues list of surgeries select ayurveda practitioners can perform - Sakshi

ఐఐసీఎం గెజిట్‌ నోటిఫికేషన్‌ 

ఐఎంఏ అభ్యంతరం

న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్‌ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) నవంబర్‌ 20న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి.

ఇందుకోసం ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌(పోస్టు గ్రాడ్యుయేట్‌ ఆయుర్వేద మెడిసిన్‌)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్‌ నోటిఫికేషన్‌పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్‌ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్‌ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ వైద్యజయంత్‌ దేవ్‌పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్‌తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు.

అది తిరోగమన చర్య: ఐఎంఏ
సీసీఐఎం అనుమతిపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top