
ధన్‌ఖడ్ వ్యవహారంలో తెరమీదకు ప్రభుత్వ వాదనలు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి సలహాలు, సూచనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలన్న రాజ్యాంగానికి జగదీప్ ధన్‌ఖడ్ బద్దుడై లేడని తాజాగా మోదీ సర్కార్ వాదనలు తెరమీదకొస్తున్నాయి. సగం కాలిన కరెన్సీ కట్టల ఉదంతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై లోక్‌సభలో ప్రభుత్వం తీర్మానం తెచ్చే పనిలో ఉంటే ఆ విషయం తెల్సి కూడా ఉద్దేశపూర్వకంగా రాజ్యసభలో విపక్ష నేతలు సమర్పించిన నోటీస్‌ను ధన్‌ఖడ్ ఆమోదముద్రవేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ అంశంలో కాంగ్రెస్ సీనియర్ నేతతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సంప్రతింపులు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తమను సంప్రతించకుండా రాజ్యసభలో తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వ పెద్దలు అప్పటికే మూడుసార్లు ధన్‌ఖడ్‌కు చెప్పిచూశారని, అయినా ఆయన వినిపించుకోలేదని తెలుస్తోంది. రాజ్యసభలో ఎన్‌డీఏ కూటమి ఎంపీల సంతకాలు లేని విపక్షాల నోటీస్‌కు ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు.
ఈ నోటీస్‌కు బదులు ఏకాభిప్రాయంతో ఎన్‌డీఏ ఎంపీల సంతకాలతో కూడిన నోటీస్ రూపకల్పనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్ మేఘ్వాల్, రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డాలు ప్రయత్నిస్తున్నారని ధన్‌ఖడ్‌కు ప్రభుత్వ వర్గాలు సూచించాయి. ఆ నోటీస్ కార్యరూపం దాల్చేలోపే విపక్షాల నోటీస్‌ను ధన్‌ఖడ్ అంగీకరించి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించారని తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలకు నాలుగైదు రోజుల ముందే ధన్‌ఖడ్‌కు ప్రభుత్వం ఒక కబురు పంపింది.
లోక్‌సభలో అన్ని పారీ్టల సమ్మితితో అభిశంసన తీర్మానం తీసుకొస్తామని, తర్వాత రాజ్యసభలోనూ ఇలాంటి తీర్మానం తీసుకొస్తామని ధన్‌ఖడ్‌కు సమాచారమిచ్చారు. సోమవారం వర్షాకాల సమావేశాలు మొదలుకాగా ఒకరోజు ముందే అంటే ఆదివారమే విపక్ష నేతలతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సమావేశమై అభిశంసన అంశంపై చర్చించారు. ఈ విషయం ఆలస్యంగా ప్రభుత్వ పెద్దలకు తెల్సింది. భేటీ విషయం బయటకు పొక్కిందని తెల్సికూడా అసలు విపక్ష నేతలకు తన కు ఏం చెప్పారనే అంశాలను ధన్‌ఖడ్ ప్రభుత్వ పె ద్దలకు వివరించకుండా మిన్నకుండిపోయారని తెలుస్తోంది.
అయితే విపక్షనేతలిచ్చే నోటీస్‌కే ఆమోదం తెలపాలని ముందే ధన్‌ఖడ్ నిర్ణయించుకున్నారని సోమవారం మోదీ సర్కార్‌కు అర్థమైపోయింది. వెంటనే ధన్‌ఖడ్‌ను కలిసి బీజేపీ ఎంపీల సంతకాలు చేశాక విపక్షాల నోటీస్‌కు ఆమోదం తెలపాలని ఆయనకు సూచించినా వినిపించుకోలేదు. ఇలా మూడుసార్లు బీజేపీ సీనియర్ నేతలు చెప్పిచూసినా ధన్‌ఖడ్ వైఖరిలో మార్పురాలేదని తెలుస్తోంది.
మొదటిసారి నడ్డా, రిజిజు, రెండోసారి రిజిజు, మేఘ్వాల్, మూడోసారి మేఘ్వాల్ ఒక్కరే ధన్‌ఖడ్‌ను కలిసి ఎన్‌డీఏ కూటమి ఎంపీల సంతకాలు ఆ నోటీస్‌లో ఉండటం అత్యంత కీలకమని గుర్తుచేశారని, ధన్‌ఖడ్ అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆ నోటీస్‌లోని విపక్ష ఎంపీల పేర్లు మాత్రమే రాజ్యసభాముఖంగా చదివుతానని కరాఖండీగా చెప్పారు. ఆదివారం కలిసిన అదే సీనియర్ కాంగ్రెస్ నేతను ఈ వివాదం తర్వాత సోమవారం సాయంత్రం సైతం ధన్‌ఖడ్ కలిసినట్లు తెలుస్తోంది. వీహెచ్‌పీ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్ అభిశంసననూ తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ధన్‌ఖడ్ మాట ఇచి్చనట్లు తెలుస్తోంది.