పైప్డ్‌ గ్యాస్‌.. దీనిపైనే ఫోకస్‌ | The goal is to reduce LPG usage as much as possible | Sakshi
Sakshi News home page

పైప్డ్‌ గ్యాస్‌.. దీనిపైనే ఫోకస్‌

Mar 29 2026 4:45 AM | Updated on Mar 29 2026 4:45 AM

The goal is to reduce LPG usage as much as possible

ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం చర్యలు 

వీలైనంత వరకు ఎల్పీజీ వాడకం తగ్గించడమే లక్ష్యం 

అదనపు వ్యయం, సబ్సిడీ భారానికీ చెక్‌  

కస్టమర్లను ప్రోత్సహించేందుకు రెంటల్‌ స్కీమ్, ఈఎంఐ వెసులుబాటు

మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన అంతరాయాలు.. దిగుమతి చేసుకునే గ్యాస్‌పై ఆధారపడిన భారత్‌ను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) నుండి అందుబాటులో ఉన్న చోట పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌కు (పీఎన్‌జీ) మారాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. గృహ వంట గ్యాస్‌ వినియోగంలో నిర్మాణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.

పైప్డ్‌ గ్యాస్‌ సౌకర్యం ఉన్న గృహాల వారు మూడు నెలల్లో పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మళ్లేలా ప్రోత్సహించేందుకు గ్యాస్‌ పంపిణీ సంస్థలు రెంటల్‌ స్కీమ్, ఈఎంఐ సౌకర్యాలను ఆఫర్‌ చేస్తున్నాయి.      –సాక్షి, స్పెషల్‌ డెస్క్

దిగుమతులపై ఆధారపడకుండా.. 
పీఎన్‌జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా కొరతగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పైప్‌లైన్‌ సౌకర్యం లేని ప్రాంతాలకు ఎల్‌పీజీ సిలిండర్లను మళ్లించి ఇంధన భద్రతను పెంపొందించాలన్నది ఆలోచన. 

ప్రస్తుతం పైప్‌లైన్లు వేసే కంపెనీలు వివిధ అనుమతులు, అధిక ఫీజులు, స్థల సేకరణ సమస్యలు, హౌసింగ్‌ సొసైటీల నుండి అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్రానికి ఒకటి కాకుండా దేశవ్యాప్తంగా గ్యాస్‌ పైప్‌లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఒక చట్టబద్ధమైన కేంద్ర వ్యవస్థ ఏర్పాటు కానుంది.

దేశవ్యాప్తంగా 784 జిల్లాల్లో.. 
గత డిసెంబర్‌ చివరి నాటికి దేశవ్యాప్తంగా 1.62 కోట్ల మంది పీఎన్‌జీ కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 వేల మంది వినియోగదార్లు ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారుతున్నారు. మన దేశంలో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ ప్రస్తుతం 784 జిల్లాలకు విస్తరించింది. ఇవి ప్రతి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలను కవర్‌ చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ వంటి 307 భౌగోళిక ప్రాంతాలుగా (జియోగ్రాఫికల్‌ ఏరియా) ఈ నెట్‌వర్క్‌ పైపుల ద్వారా సహజ వాయువును గృహ వినియోగదార్లకు అందిస్తోంది.  

రూ.500 కడితే చాలు.. 
గృహ వినియోగదారులు పీఎన్‌జీ కనెక్షన్‌ కావాలంటే వన్‌ టైమ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. కంపెనీని బట్టి ఇది రూ.9 వేల వరకు ఉంది. భవనంలోని కనెక్షన్ల సంఖ్య పెరిగితే ఈ మొత్తం తగ్గుతుంది. కొన్ని కంపెనీలు కనెక్షన్‌ను వాయిదాల పద్ధతిలో కూడా ఇస్తున్నాయి. రెండు నెలలకు (బిల్‌ సైకిల్‌) రూ.500 కడితే చాలు. తాత్కాలిక కనెక్షన్‌ కావాల్సినవారు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. పీఎన్‌జీ ధర ఒక యూనిట్‌కు (స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.51గా ఉంది. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రెండు నెలలకు సగటున 24 యూనిట్లు ఖర్చు అవుతుందని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు.  

అవసరాల్లో సగం దేశీయంగానే ఉత్పత్తి 
» దేశ గ్యాస్‌ అవసరాల్లో సగ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది.  
» దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువులో కృష్ణా–గోదావరి బేసిన్‌ వాటా 25%, అస్సాం, త్రిపుర బేసిన్ల వాటా 13%గా ఉంది. మిగిలింది ముంబై, రాజస్తాన్, కాంబే బేసిన్‌ (గుజరాత్‌) ఉత్పత్తి చేస్తున్నాయి.  
» 2024–25లో భారత్‌ 35,594 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి చేసింది. అదే సమయంలో 35,720 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) దిగుమతి చేసుకుంది.  
» భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ఎల్‌ఎన్‌జీలో ఖతార్, యూఏఈ వాటా 50% పైమాటే.  
» మధ్యప్రాచ్యం మీద ఆధారపడడం తగ్గించి యూఎస్, ఆ్రస్టేలియా, రష్యా, మొజాంబిక్‌ నుంచి పెద్ద ఎత్తున ఎల్‌ఎన్‌జీ కొనుగోళ్ల డీల్స్‌కు భారత్‌ శ్రీకారం చుట్టింది.  

పీఎన్‌జీ ఎందుకు ?
ఇంధన భద్రత, స్థిరత్వం: కేవలం ఓడల ద్వారా హార్మూజ్‌ జలసంధి వంటి కీలక మార్గాల గుండా వచ్చే ఎల్‌పీజీపై ఆధారపడటం వల్ల అక్కడ ఏదైనా అంతరాయం కలిగితే లక్షలాది మందికి వంట గ్యాస్‌ అందకుండా పోతుంది. దీనికి భిన్నంగా స్వదేశీ గ్యాస్‌ నిల్వలు, వివిధ దిగుమతి కేంద్రాలు, ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ చాలా సురక్షితమైనది, నమ్మదగినది. 

తక్కువ ఖర్చు: సిలిండర్లు, లారీలు, బాట్లింగ్‌ ప్లాంట్లు, డీలర్ల ఖర్చులు అన్నీ కలిసి ఎల్‌పీజీ ధర నిర్ణయం అవుతుంది. పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ నేరుగా ఇంటికి చేరడం వల్ల ఈ అదనపు ఖర్చులు తగ్గుతాయి. ఎల్‌పీజీతో పోలిస్తే పీఎన్‌జీ వ్యయం 20–30% తక్కువ అని కంపెనీలు చెబుతున్నాయి. 

సౌకర్యం, భద్రత: వంట మధ్యలో గ్యాస్‌ అయిపోతుందనే భయం ఉండదు. ప్రమాద భయం లేదు. ఇందులోని మీథేన్‌ గాలి కంటే తేలిక. సులభంగా గాలిలో కలిసిపోతుంది. స్వచ్ఛమైన ఇంధనం కూడా.  

రాయితీ భారాన్ని తగ్గించడం: ప్రభుత్వం ఉజ్వల పథకం కింద కోట్లాది కుటుంబాలకు ఎల్‌పీజీపై సబ్సిడీ ఇస్తోంది. ప్రజలను పీఎన్‌జీకి మార్చడం ద్వారా ప్రభుత్వంపై పడే ఈ ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. 

లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ)
అతిగా చల్లబర్చిన సహజ వాయువు. దీనిని సుమారు మైనస్‌ 162 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ద్రవ రూపంలోకి మారుస్తారు. తద్వారా దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల ట్యాంకర్లలో నింపి సముద్రాల గుండా రవాణా చేయడం సులభం అవుతుంది. ఇది గమ్యస్థానానికి చేరుకున్నాక తిరిగి వేడి చేసి వాయువుగా మార్చి పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పీఎన్‌జీ సేవలు అందిస్తున్న కంపెనీలు.. 
తెలంగాణ: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్‌ గ్యాస్, టోరెంట్‌ గ్యాస్, మహారాష్ట్ర నేచురల్‌ గ్యాస్‌. 
ఆంధ్రప్రదేశ్‌: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్‌ గ్యాస్, గోదావరి గ్యాస్, థింక్‌ గ్యాస్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement