సినీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు | Center takes strict action against movie piracy | Sakshi
Sakshi News home page

సినీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు

Mar 29 2026 4:34 AM | Updated on Mar 29 2026 4:34 AM

Center takes strict action against movie piracy

అనుమతి లేకుండా సినిమా రికార్డ్‌ చేస్తే మూడేళ్ల జైలు, రూ.3 లక్షల జరిమానా 

కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2023లో సవరించిన సినిమాటోగ్రాఫ్‌ చట్టం ద్వారా పైరసీ నిరోధానికి బలమైన న్యాయ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్‌. మురుగన్‌ వెల్లడించారు. సవరించిన చట్టంలోని సెక్షన్‌ 6ఏఏ, 6ఏబీ ప్రకారం సినిమాలను అనుమతి లేకుండా రికార్డ్‌ చేయడం, ప్రసారం చేయడం నిషేధించబడిందన్నారు. 

ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాల జైలు, సినిమా మొత్తం ఖర్చులో 5 శాతం వరకు జరిమానా విధించేలా అవకాశం ఉందన్నారు. ఇక పైరసీ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. టెలిగ్రామ్‌ యాప్‌లో అనధికారికంగా కంటెంట్‌ ప్రసారం చేస్తున్న 3,142 చానళ్లను తొలగించాలని 2026 మార్చి 11న నోటీసులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. 

అలాగే సుమారు 800 పైరసీ వెబ్‌సైట్లను ఇంటర్నెట్‌ సేవా దాతల ద్వారా బ్లాక్‌ చేయించినట్లు చెప్పారు. పైరసీ ఫిర్యాదులను స్వీకరించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించిందన్నారు. ఇంటర్నెట్‌లో చట్టవిరుద్ధ కంటెంట్‌ను తొలగించేందుకు సమాచార సాంకేతిక చట్టం–2000 కింద కూడా నిబంధనలు అమల్లో ఉన్నాయన్నారు. 

2021 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సహా అన్ని మధ్యవర్తి సంస్థలు కాపీరైట్‌ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈచర్యల ద్వారా సినీ, టెలివిజన్, డిజిటల్‌ కంటెంట్‌ పైరసీని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు డా. ఎల్‌. మురుగన్‌ సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement