రంగంలోకి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ లోహిత్ అనే వ్యక్తి అరెస్టు
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే రోడ్డు సమీపంలో జిలెటిన్ స్టిక్స్ బాక్స్ లభించడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ) రంగంలోకి దిగాయి. లోహిత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద పోలీస్ శాఖ, పలు దర్యాప్తు సంస్థల ఫోన్ నంబర్లు ఉండటం గమనార్హం. ఇతడు ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ చేసేవాడని తెలిసింది. అతన్ని పోలీసులు విచారించగా.. ‘నాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలుసు. ఎన్‌ఐఏ డైరెక్టర్ తెలుసు. సీబీఐ డైరెక్టర్ కూడా తెలుసు.
డీజీపీతో మాట్లాడతా’ అంటూ విచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అతడు ఏదైనా ఉద్దేశంతో పేలుడు పదార్థాలను తెచ్చాడా లేక సంచలనం సృష్టించడానికా? అనేది పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. 3 కేంద్ర బృందాలు బెంగళూరు దక్షిణ జిల్లా (రామనగర) కగ్గలీపుర సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టె లభ్యమైన ఒడేరహళ్లి గేట్ రోడ్డును పరిశీలించాయి. పోలీసులు సీజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ బాక్స్‌ను పరిశీలించి వివరాలు తీసుకున్నారు. అవి తయారైన చోటు, అమ్మిన డీలరు తదితరుల సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
పోలీసు అధికారులపై చర్యలు?
ప్రధాని పర్యటనలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారని పలువురు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్ర నిఘా విభాగం ఐజీ లాభు రామ్, బెంగళూరు దక్షిణ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌గౌడ సహా పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.


