మళ్లీ రాజుకున్న రఫేల్‌ గొడవ

France opens judicial probe into fighter deal with India - Sakshi

భారత్‌ రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వివాదంపై ఫ్రాన్స్‌లో తాజాగా దర్యాప్తు న్యాయమూర్తిని నియమించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం 

ఫ్రెంచ్‌ పరిశోధక వెబ్‌సైట్‌ ‘మీడియాపార్ట్‌’ వెల్లడి 

కాంగ్రెస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ సంస్థ నుంచి భారత్‌ 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రెంచ్‌ పరిశోధక వెబ్‌సైట్‌ ‘మీడియాపార్ట్‌’ వెల్లడించింది. విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది. దాదాపు రూ.59 వేల కోట్ల విలువైన ఫైటర్‌ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే.

దసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్‌ ఫైటర్‌ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్‌ జెట్లను దసాల్ట్‌ సంస్థ తయారుచేసి భారత్‌కు పంపించింది. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద రఫేల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌లో ‘నేషనల్‌ ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్‌ ఆఫీస్‌(పీఎన్‌ఎఫ్‌)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు మీడియాపార్ట్‌ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్‌ ప్రభుత్వం.. పీఎన్‌ఎఫ్‌ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది.

భారత మధ్యవర్తికి రూ.8.84 కోట్లు  
రఫేల్‌ ఒప్పందంలో అవినీతి, అవకతవకలపై ‘షెర్పా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఫిర్యాదు చేసిందని, ఆర్థిక నేరాల గుట్టును రట్టు చేయడంలో ఈ సంస్థ దిట్ట అని మీడియాపార్ట్‌ గతంలో పేర్కొంది. డీల్‌ కుదిర్చినందుకు దసాల్ట్‌ .. భారత్‌లోని ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు(దాదాపు రూ.8.84 కోట్లు) కమీషన్‌ కింద చెల్లించినట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను దసాల్ట్‌ కంపెనీ కొట్టిపారేసింది. రఫేల్‌ ఒప్పందంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పింది. రఫేల్‌ డీల్‌ లో కమీషన్ల బాగోతంపై వచ్చిన మొదటి ఫిర్యాదును 2019లో అప్పటి పీఎన్‌ఎఫ్‌ చీఫ్‌ ఎలియానీ హూలెట్‌ తొక్కిపెట్టారని మీడియాపార్ట్‌ వెబ్‌సైట్‌ పాత్రికేయుడు యాన్‌ ఫిలిప్పిన్‌ ఆరోపించారు.   

ప్రత్యర్థి కంపెనీల ఏజెంట్‌ రాహుల్‌: బీజేపీ  
కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ప్రత్యర్థి రక్షణ కంపెనీల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆయా కంపెనీ చేతుల్లో పావుగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా శనివారం మండిపడ్డారు. రఫేల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌తోపాటు రాహుల్‌ గాంధీ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారానికి కాంగ్రెస్‌ పార్టీ పర్యాయపదంగా మారిపోయిందన్నారు. రఫేల్‌ డీల్‌లో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టలేదని, ఆ అక్కసుతో ఎన్డీయే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రఫేల్‌ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ‘కాగ్‌’, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయని సంబిత్‌ గుర్తుచేశారు. ఫైటర్‌ జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించలేదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని అన్నారు.

జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్‌
రఫేల్‌ ఒప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా శనివారం డిమాండ్‌ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ల జెట్ల కొనుగోలులో గోల్‌మాల్‌ను నిగ్గుతేల్చడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలని సూర్జేవాలా డిమాండ్‌చేశారు. ‘ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రెంచ్‌ ప్రభుత్వం అంగీకరించింది. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాంటప్పుడు ఈ అవినీతికి మూలకేంద్రమైన భారత్‌లో జేపీసీ దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ అంశం కాదని, దేశ భద్రత, అవినీతికి సంబంధించిన అంశమన్నారు. రఫేల్‌ డీల్‌ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top