
న్యూఢిల్లీ: పెద్దసంఖ్యలో యుద్ధనౌకలు, జలాంతర్గాములతో భారత్‌కు పక్కలో బళ్లెంలో తయారైన చైనాకు సాటిగా ఎదిగేందుకు భారత్ మరో అడుగు ముందుకేస్తోంది. అత్యంత శక్తివంతమైన రెండు జలాంతర్గాముల తయారీ, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ సమాయత్తమైంది. ప్రభుత్వరంగ మజగావ్ డాక్ లిమిటెడ్, ఫ్రాన్స్ రక్షణరంగ దిగ్గజం నావల్ గ్రూప్‌లో కలిసి మూడు స్కారి్పయన్ శ్రేణి జలాంతర్గాములను భారత్ తయారుచేయనుంది.
రూ.36,000 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి రెండేళ్ల క్రితమే రక్షణశాఖ ఆమోదం తెలిపినా సాంకేతిక, వాణిజ్యపర అంశాల్లో స్పష్టతలేక ఇన్నాళ్లూ చర్చల దశలోనే ఈ ఒప్పందం తచ్చాడుతోంది. దీనికి తోడు మరో రూ.65,000 కోట్లతో ఆరు డీజిల్–ఎలక్ట్రిక్ నిఘా జలాంతర్గాములను సమీకరించుకోవాలని భారత రక్షణశాఖ తలపోస్తోంది. మొత్తంగా రూ.1 లక్ష కోట్ల భారీ ప్రాజెక్టులపై కదలిక వచ్చిందని సంబంధిత విశ్వసనీయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాముల ప్రాజెక్ట్‌కు సైతం రక్షణశాఖ 2021లో ఆమోదం తెలిపినా అది కార్యరూపం దాల్చలేదు.