తమిళనాడు: వేలూరు సమీపంలోని పాఠశాల విద్యార్థి ని కన్న తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు తాలూకాకు చెందిన 13 సంవత్సరాల బాలిక వేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివింది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన బాలికకు ఉన్నపళంగా అనారోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.
అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక రెండు నెలలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీటిపై ఆసపత్రి నిర్వాహకులు బాలిక మైనర్ కావడంతో వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలూరు మహిళా పోలీసులు బాలిక వద్దకు చేరు కొని విచారణ జరపగా ఆ సమయంలో ఆ బాలిక కాట్పాడికి చెందిన ఒక యువకుడిని ప్రేమించినట్లు అతను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసేందుకు అతని వివరాలు, ఫొటో, చిరునామా వివరాలు అడిగారు. ఆ సమయంలో బాలిక మాటలు తడబడుతూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన పోలీసులు బాలిక వద్ద సమగ్రమైన విచారణ చేపట్టారు.
ఆ సమయంలో తన తండ్రి పెయింటర్‌గా పనిచేసేవాడని రాత్రి వేళల్లో మద్యం మత్తులో తన తల్లి నిద్రించిన సమయంలో తనను బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటకు చెపితే కుటుంబంలోని అందరినీ హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అదే విధంగా తన కన్న తండ్రి కారణంగా తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టకూడదనే కారణంతోనే కాటా్పడిలోని ఒక యువకుడిపై చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన వేలూరు పట్టణంలో సంచలనం రేపింది.


