
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కోచింగ్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్‌లోని ఒక భవనంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ పేలుడు తీవ్రతకు భవనం పైకప్పుతో సహా ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయి. పేలుడు గ్యాస్ సిలిండర్ కారణామా? షార్ట్ సర్క్యూటా? లేదా పేలుడు పదార్థం వల్ల ఈ ఘటన జరిగిందా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.