
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొనే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రత్యేకమైనది. ’నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం’లో ’ఏక బదిలీ ఓటు’ పద్ధతి ద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే ప్రతి ఎంపీ బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
బ్యాలెట్ పత్రాలపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు తమకు ఇష్టమైన అభ్యర్థి పేరు పక్కన ’1’ అని రాయడం ద్వారా తమ మొదటి ప్రాధాన్యతను సూచించాలి. ఈ అంకెను భారతీయ సంఖ్యలలో, రోమన్ సంఖ్యలలో లేదా ఏదైనా భారతీయ భాషలోని సంఖ్యలలో రాయవచ్చు, కానీ అక్షర రూపంలో రాయకూడదు.
సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లా ఓటు విలువలో సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఎంపీ ఓటు విలువ ’ఒకటి’ (1) గానే పరిగణిస్తారు. గెలవడానికి అభ్యర్థి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50% కంటే ఎక్కువగా (కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి రౌండ్‌లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి, వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు.
పోటీ ఉంటేనే పోలింగ్
భారత రాజ్యాంగం ప్రకారం, ఉప రాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు కొత్తవారిని ఎన్నుకోవడం రాజ్యాంగ బద్ధమైన విధి. ఒకవేళ అధికార, విపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదిరి, ఒక్కరే అభ్యర్థి బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు విజేతను నిర్ణయించడానికి పోలింగ్ తప్పనిసరి.
రహస్య పద్ధతిలో ఎందుకు?
ఉప రాష్ట్రపతి ఎన్నికను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడానికి బలమైన రాజ్యాంగ పరమైన కారణాలు ఉన్నాయి. ఎంపీలు ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు, పార్టీ విప్‌లకు లొంగకుండా తమ అంతరాత్మ ప్రబోధం మేరకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఇది వీలు కలి్పస్తుంది. రాజకీయాలకు అతీతంగా సభ్యులు తమ ప్రతినిధిని ఎన్నుకోవాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని పార్టీ ఏజెంట్లతో సహా ఎవరికీ చూపించడానికి వీల్లేదు.