కంపాలా(ఉగాండా): టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ అపూర్వ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఆమెకు 97 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని శనివారం అధికారులు ప్రకటించారు. ఎన్నికలు వివాదాస్పదంగా మారిన వేళ అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. దేశ పరిపాలనా రాజధాని డొహొమాలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆమెను ఎన్నికల్లో విజేతగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ అందజేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలను పోటీలో లేకుండా చేయడం, చిన్న పార్టీలకు చెందిన 16 మంది అభ్యర్థులను హస్సన్ ఎదుర్కోవడం తదితర అంశాల్లో ఈ ఎన్నికలపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అక్టోబర్ 29వ తేదీన ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి రావడంతోపాటు పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులు, మిలటరీతో తలపడ్డారు. ఈ ఘర్షణల్లో కనీసం 10 మంది చనిపోయినట్లు ఐరాస మానవ హక్కుల విభాగం ప్రకటించింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జాన్ పొంబె ముగుఫులి కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోవడంతో, ఉపాధ్యక్షురాలిగా ఉన్న హస్సన్ 2021లో అధ్యక్షురాలయిన సంగతి తెలిసిందే.


