
బెంగళూరు: ఆయనో గుమస్తా(క్లర్క్). ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లను నిర్వహించడం, డాక్యుమెంట్లను తయారు చేయడం, డేటా ఎంట్రీ, కార్యాలయ పరిపాలనకు సహాయం చేయడమే పని.నెలకు జీతం అక్షరాల రూ.15,000. ప్రభుత్వ ఉద్యోగి. అనుభవం ఉంది కాబట్టి ఆస్తులు మహా అయితే ఎంతుండొచ్చు. ఓ సొంతిల్లు. ఓ పదిపదిహేను లక్షల డబ్బు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్లర్క్ ఆస్తులు రూ.30కోట్లు,బంగారం,పదుల సంఖ్యలో భవానాలు,ఎకరాలకొద్దీ పొలాలు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా?
బెంగళూరులో శుక్రవారం లోకాయిక్తా అధికారులు ప్రభుత్వ కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (కేఆర్‌ఐడీఎల్) కార్యాలయంలో మాజీ క్లర్క్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని కొప్పల్ పట్టణంలో ప్రభుత్వ ఆఫీస్‌లో కలకప్ప నిడగుండి క్లర్క్‌గా విధులు నిర్వహించేవారు జీతం రూ.15000. కానీ లోకాయిక్తా అధికారులు జరిపిన దాడుల్లో భయటపడ్డ కలకప్ప నిండగుండి ఆస్తుల్ని చూసి కంగుతిన్నారు.
కలకప్ప నిండగుండితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద 24 ఇళ్లు,నాలుగు ఫ్లాట్లు, 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,నాలుగు వాహనాలు 350 గ్రాముల బంగారం,1.5కేజీ వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిడగుండి, మాజీ కేఆర్‌ఐడీఎల్ ఇంజనీర్, జెడ్‌ఎం చిన్చోల్కర్, పూర్తి కాని 96 అసంపూర్ణ ప్రాజెక్టులకు నకిలీ పత్రాలను సృష్టించి రూ. 72 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లోకాయుక్తా అధికారులు మాజీ గుమస్తా నిడగుండి నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.