రక్షణ లేని బాల భారతం! | Sakshi
Sakshi News home page

రక్షణ లేని బాల భారతం!

Published Mon, Oct 31 2022 5:06 AM

Every 3rd crime against children relates to sexual offences says NCRB - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బాలలపై నేరాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 53,874 పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) కేసులు నమోదైనట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. బాలలపై జరిగే నేరాల్లో ప్రతి మూడింటిలో ఒకటి లైంగిక నేరమే కావడం గమనార్హం. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. దేశంలో బాలలపై నేరాలకు సంబంధించి 2020లో 1,28,531 కేసులు, 2021లో 1,49,404 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదిలోనే కేసులు 16.2 శాతం పెరిగాయి. 2021లో పోక్సో చట్టం సెక్షన్‌ 4, 6 కింద 33,348 కేసులు నమోదయ్యాయి. వీటిలో 33,036 కేసులు బాలికలపై జరిగిన అఘాయిత్యాలకు, 312 కేసులు బాలురపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా బాలల అపహరణలకు సంబంధించి గతేడాది 67,245 కేసులు నమోదయ్యాయి.  

ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక నేరాలు  
బాలలపై నేరాల వ్యవహారంలో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు రిజిస్టరయ్యాయి. 2021లో 140 మంది చిన్నారులు అత్యాచారం, ఆపై హత్యకు గురయ్యారు. మరో 1,402 మంది కేవలం హత్యకు గురయ్యారు. అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే బయటపడ్డాయి. గర్భంలోనే శిశువులను చిదిమేసినట్లు గతేడాది 121 కేసులు రిజిస్టరయ్యాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 23, గుజరాత్లో 23 నమోదయ్యాయి. ఆత్మహత్య చేసుకొనేలా బాలలను ప్రేరేపించినట్లు 359 కేసులు వచ్చాయి. గత ఏడాది 49,535 మంది చిన్నపిల్లలు కనిపించకుండా పోయారు. గతేడాది బాల కార్మిక చట్టం కింద 982 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా 305 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. బాల్యవివాహ నిషేధ చట్టం కింద గతేడాది 1,062 కేసులు పెట్టగా, ఇందులో ఎక్కువ కేసులు కర్ణాటక, తమిళనాడు, అస్సాంలో నమోదయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement