
ముంబై: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతబలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
బుధవారం ఉదయం మహరాష్ట్ర పోలీసులు,భద్రత బలగాలకు గడ్చిరోలి జిల్లాలోని దండకారణ్యంలో ఎటపల్లి తాలూకాలోని మోదస్కే గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహించాయి.
గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీ-నక్సల్ కమాండో దళం సీ-60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుండి పోలీసులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. సీ-60 దళం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోల ఎదురు కాల్పులు పోలీసులు తిప్పికొట్టారు. ఇద్దరు మహిళా నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేశారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్, అధునాతన పిస్టల్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.