ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ బాంబు పేలి ఐటీబీపీ జవాను మృతి 

Elections Are Over In Madhya Pradesh And Chhattisgarh - Sakshi

మధ్యప్రదేశ్‌లో 76% 

ఛత్తీస్‌గఢ్‌లో 70.59% 

రెండు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌

పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం

పలుచోట్ల చెదురుమదురు సంఘటనలు, ఘర్షణలు

రాయ్‌పూర్‌:  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా ఒకే దశలో, ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాల్లో శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు అమర్చిన బాంబు పేలి ఐటీబీపీ హెడ్‌ కానిస్టేబుల్‌ మరణించాడు. సాయంత్రం 5 గంటలకల్లా మధ్యప్రదేశ్‌లో 76 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 70.59 శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మారుమూల ప్రాంతాల నుంచి సమాచారం ఇంకా అందలేదని, పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది. శనివారం పూర్తి గణాంకాలు వెల్లడవుతాయని పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో హింసాకాండ
మధ్యప్రదేశ్‌లో 230 స్థానాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసింది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, మాజీ సీఎం కమల్‌నాథ్, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు సహా సహా 2,533 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో హింసాకాండ చోటుచేసుకుంది. మేగావ్‌ నియోజకవర్గం పరిధిలోని మనహాడ్‌ గ్రామంలో పోలింగ్‌ కేంద్రం బయట కొందరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

దిమానీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన జరిగిన గొడవల్లో ఇద్దరు గాయపడ్డారు. ఇండోర్‌లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. రాజ్‌నగర్‌లో బీజేపీ నేతల వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జబల్పూరులో ఘర్షణలు జరిగాయి.  

నక్సల్స్‌ బాంబు పేలుడులో ఐటీబీటీ జవాన్‌ మృతి   
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు బలగాలు పోలింగ్‌ సామగ్రితో తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రెజర్‌ బాంబు పేలి ఒక జవాన్‌ మృతి చెందగా, మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గరియాబంద్‌ జిల్లాలోని బింద్రనావగఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గం గోబ్రాలో పోలింగ్‌ ముగిశాక శుక్రవారం సాయంత్రం ఈవీఎంలు సహా ఇతర సామగ్రితో ఉద్యోగులు, జవాన్లు తిరుగు ప్రయాణమయ్యారు.

అటవీ మార్గం ద్వారా జిల్లా కేంద్రానికి కాలినడకన వస్తుండగా, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు ఏర్పాటు చేసిన ప్రెజర్‌బాంబును ఐటీబీటీ విభాగానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ జోగిందర్‌ సింగ్‌ పొరపాటున తొక్కడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో ఆయన వెనక ఉన్న మరో జవాన్‌కు గాయాలయ్యాయి.   

ఏనుగు దాడిలో ఓటరు మృతి  
ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత గరియాబంద్‌ జిల్లాలోని 9 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలో చివరి దశ ఎన్నికల్లో ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్, 8 మంది మంత్రులు, నలుగురు ఎంపీలు పోటీపడ్డారు.

వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటాన్‌దుర్గ్‌ జిల్లాలోని కురుద్ధి గ్రామంలో కాంగ్రెస్‌ నేత, ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 75కుపైగా స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బలోడాబజార్‌–భాతపారా జిల్లాలోని కాస్‌డోల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద వరుసలో నిల్చున్న సహోదరబాయి నిషాద్‌(58) అనే మహిళ అకస్మాత్తుగా మృతి చెందింది.

కొరియా జిల్లాలోని మాంగోరా గ్రామంలో ఉమేంద్ర సింగ్‌(25) అనే యువకుడు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా, ఏనుగు దాడి చేసింది. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చివరి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top