పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉండాల్సిన యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగప్రవేశం చేసింది. ఈ అంశం అంర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాలతో ముడిపడి ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ, మనీల్యాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)ను నమోదు చేసింది. దీంతోపాటు.. బంగారు తాపడం కేసులోనూ మనీల్యాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తోంది.
బంగారు తాపడం కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారికి బంగారాన్ని అమ్మేసి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. దీంతో.. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తులో ముందుకు సాగాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాణి మెజిస్ట్రేట్ కోర్టులో.. ఆ ఎఫ్ఐఆర్ కాపీని అందజేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. కేసు హైకోర్టు పరిధిలో ఉండడంతో.. ఈడీ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎప్పుడు మిస్సయ్యాయి?
2018 నుంచే శబరిమల అయ్యప్ప ఆలయంలోని యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సయినట్లు క్రైమ్ బ్రాంచఠ్ భావిస్తోంది. అప్పట్లో యోగదండాన్ని బంగారు పూత కోసం తరలించారు. అలా తరలించడం ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్(మజహర్ రికార్డు)లో నమోదు కాలేదు. అప్పట్లోనే అత్యంత ఖరీదైన పురాతన ఏకముఖీ రుద్రాక్షల మాలను కూడా బంగారు పూతకు తీసుకెళ్లారు. హైకోర్టు అనుమతి లేకుండానే.. ఓ అధికారి వీటిని బయటకు పంపేందుకు అనుమతినిచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
యోగదండం విశిష్టత ఇదీ..!
మండల-మకరవిళక్కుతోపాటు.. నెలవారీ పూజలు, ప్రత్యేక సందర్భాలలో జరిగే పూజల తర్వాత.. హరివరాసనాన్ని ఆలపించి, ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అయ్యప్ప యోగనిద్రలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయాన్ని మూసివేసే ముందు.. అయ్యప్ప వద్ద యోగదండం పెడతారు. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాలను స్వామిని అలంకరిస్తారు. భస్మాభిషేకంతో విగ్రహాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఏకముఖీ రుద్రాక్ష అనేది అత్యంత ఖరీదైనది. ఇప్పుడు కనిపించకుండా పోయినది ఏకంగా ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాల. అదేవిధంగా యోగదండం అనేది అత్యంత పురాతనమైనది. దీని వెల అమూల్యమని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.


