నేడే కౌంటింగ్‌.. అందరి చూపు బెంగాల్‌ పైనే! | eci all sets for five states Assembly election results 2026 | Sakshi
Sakshi News home page

నేడే కౌంటింగ్‌.. అందరి చూపు బెంగాల్‌ పైనే!

May 4 2026 4:31 AM | Updated on May 4 2026 5:27 AM

eci all sets for five states Assembly election results 2026

పశ్చిమ బెంగాల్‌ సహా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడే కౌంటింగ్‌  

ఏర్పాట్లు పూర్తిచేసిన ఎన్నికల సంఘం  

అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టదిట్టమైన భద్రత  

కౌంటింగ్‌ సిబ్బందికి తొలిసారిగా క్యూఆర్‌ కోడ్‌ ఐడీ కార్డులు  

అనధికార వ్యక్తులను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు  

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంల లెక్కింపు   

ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం  

ఉప ఎన్నికలు జరిగిన ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ నేడు ఓట్ల లెక్కింపు  

దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. 

సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. 

ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్‌ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

 అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.       

బెంగాల్‌లో రికార్డు స్థాయి ఓటింగ్‌ ఎవరికి లాభమో?   
పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్‌ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్‌ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విపరీతంగా శ్రమించింది. 

ఈసారి బెంగాల్‌లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్‌ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్‌ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్‌ల్లో శనివారం రీపోలింగ్‌ చేపట్టగా, 87 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. 

బెంగాల్‌లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది.

 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్‌కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది.    

తమిళనాడులో విజయం విజయ్‌దేనా?
తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి అర్చనా పటా్నయక్‌ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 23న ఒకే విడతలో పోలింగ్‌ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. కౌంటింగ్‌ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. 

ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్‌ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్‌ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టంచేయగా, విజయ్‌ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ తేల్చిచెప్పింది.    

అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు  
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్‌పోల్స్‌ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్‌ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఉన్నాయి. కాంగ్రెస్‌ కూటమిలో రాయ్‌జోర్‌ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), ఏపీహెచ్‌ఎల్‌సీ తదితర పార్టీలు ఉన్నాయి.  

కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే!  
కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్‌ 9న జరిగిన పోలింగ్‌లో 79.63 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్‌పై యూడీఎఫ్‌ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. 

కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్‌లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్‌ స్లిప్‌లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.  

పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే!  
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్‌జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి.  

    – సాక్షి, నేషనల్‌æడెస్క్‌
2
 

Advertisement
 
Advertisement
Advertisement