‘ఎన్నికల’ పిటిషన్ల దాఖలుకు టైమ్‌లైన్‌ విధించండి

EC moves Supreme Court for fixing timeline for filing election - Sakshi

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంలు, వీవీప్యాట్లు కావాలి

సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: అస్సాం, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి నిర్ధిష్టమైన గడువు(టైమ్‌లైన్‌) విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ కారణంగా గడువును పెంచుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని, ఫలితంగా 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను తాము ఇంకా భద్రపర్చాల్చి వస్తోందని పేర్కొంది.

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని తెలియజేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరింది. ఎన్నికల సంఘం వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. దీనిపై వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 కింద పిటిషన్లు దాఖలు చేయడానికి గడువును పెంచుతూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఈ గడువును పెంచుతున్నట్లు కోర్టు ప్రకటించింది. ఎన్నికైన అభ్యర్థులపై, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే ఎవరైనా సరే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో విచారణ ముగిసి, తీర్పు వచ్చేదాకా సదరు ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోర్టులు వాటిని సాక్ష్యంగా పరిగణిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వల్ల భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం వాటిని విడుదల చేయాలని ఎన్నికల సంఘం కోరుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top