‘ఈటింగ్ ఆన్ ది గో’వద్దని వైద్యుల సూచన
ఎంత బిజీగా ఉన్నా సరే.. తినడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చాలామంది నడుస్తూ లేదా డ్రైవ్ చేస్తూ లేదా ప్రయాణిస్తూ త్వరత్వరగా తినేస్తుంటారు. దీనినే ఈటింగ్ ఆన్ ది గో (కదులుతూ తినడం) అంటారు. ఇలా హడావుడిగా తినడం వల్ల శరీరానికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో వైద్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మందగిస్తుంది
నడుస్తూ తినేటప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలడం కుదరదు. దీనివల్ల ఆహారం పెద్ద పరిమాణంలో నేరుగా కడుపులోకి వెళుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు రక్తం జీర్ణవ్యవస్థ వైపు కాకుండా కాళ్లు, చేతుల కండరాల వైపు ప్రవహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
తెలియకుండానే అతిగా తినేస్తాం
ప్రయాణాల్లో లేదా వేరే పనుల్లో ఉంటూ తినడం వల్ల మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. కడుపు నిండిందనే సంకేతాన్ని మెదడు సకాలంలో అందుకోలేదు. దీంతో మనకు తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువ క్యాలరీలు లాగించేస్తాం.
ఊబకాయం.. బరువు పెరగడం
త్వరత్వరగా నడుస్తూ తినే అలవాటు ఉన్నవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరం ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించకుండా, వాటిని నేరుగా కొవ్వుగా మార్చే ప్రమాదముంది.
గ్యాస్ సమస్యలు (బ్లోటింగ్, గ్యాస్)
కదులుతూ వేగంగా తినడం వల్ల ఆహారంతోపాటు ఎక్కువ మొత్తంలో గాలి కూడా కడుపులోకి వెళుతుంది. ఇది కడుపులో ఉన్నప్పుడు, గ్యాస్ నొప్పులను కలిగిస్తుంది. ఫలితంగా తరచు తేన్పులు వస్తాయి.
మానసిక తృప్తి ముఖ్యం
ప్రశాంతంగా తిన్నప్పుడే ఆ హారం రుచి, సువాసన మనసుకు తృప్తినిస్తాయి. హడావుడిగా తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపించినా, మానసికంగా ఇంకా ఏదో తినాలనే కోరిక మిగిలిపోతుంది. కాబట్టి రోజులో ఎంత పని ఉన్నా.. భోజనానికి కాస్త సమయం కేటాయించడం మంచిది.


