దుమ్ము తుపాను, భీకర గాలుల బీభత్సం
న్యూఢిల్లీ/జైపూర్: ప్రకృతి ప్రకోపానికి శనివారం దేశరాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతాలతోపాటు రాజస్తాన్ అతలాకుతలమైంది. జాతీయరాజధాని పరిధి(ఎన్సీఆర్)లోని చాలా చోట్ల వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీనికితోడు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దుమ్ము గాలులు వీస్తూ స్థానికులను తీవ్ర ఇబ్బందులపాల్జేశాయి. థార్ ఎడారికి నిలయమైన రాజస్తాన్‌లో ఇసుక తుపాన్ల ధాటికి జనజీవనం కొన్ని గంటలపాటు స్తంభించిపోయింది. దుమ్ము తుపాన్లకు పిడుగులు, మెరుపులు తోడవడంతో ఢిల్లీ–ఎన్సీఆర్, రాజస్తాన్ వాసులు శనివాం ప్రకృతి ప్రకోపానికి గురికావాల్సి వచ్చిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏమిటీ ఆందీ?
వాయవ్య భారతంలో రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఉరుములు, మెరుపులతో కూడిన భీకర గాలులు వీయడాన్ని ఆందీగా పిలుస్తారు. మే చివరివారంలో ప్రకృతి ఇలా దుమ్ము తుపాన్ల రూపంలో వాయవ్య భారతాన్ని చుట్టేస్తుంది. ఎండాకాలంలోని చండ ప్రచండ వేడిమికి భూమి ఉపరితలం అత్యధికంగా వేడెక్కుతుంది. దీంతో గాలిలో స్థిరత్వం అదుపుతప్పుతుంది. దీనికి ధూళి గాలులు తోడై దుమ్ము తుపానులను సృష్టిస్తాయి. వీటికి సమీపంలోని థార్ ఎడారికి నిలయమైన రాజస్తాన్ గుండా ఇసుకరేణువులు గాలితోపాటు ఎగిరొచ్చి ఢిల్లీ–ఎన్సీఆర్‌లో ధూళి బీభత్సం సృష్టిస్తున్నాయి.
రాజస్తాన్‌లో ఇసుక బీభత్సం
రాజస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో శనివారం సైతం ఇసుక తుపాన్లు, వర్షం స్థానికులను తెగ ఇబ్బందులకుగురిచేశాయి. దుమ్ముతోపాటు ఇసుక గాల్లోకి లేవడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రహదారులపై దుమ్ము కమ్ముకుంది. దీంతో ప్రయాణికులకు రహదారులపై ఏముందో కని్పంచకపోవడంతో డ్రైవర్లు పట్టపగలే హెడ్‌లైట్లు ఆన్‌చేసుకుని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించారు. హనుమాన్‌గఢ్, శ్రీ గంగానగర్ రీజియన్లలో ఇసుక తుపాను ప్రభావం ఎక్కువగా కన్పించింది. భీకర గాలుల ధాటికి చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి.
గత 24గంటల్లో ఛురు, హనుమాన్‌గఢ్, శ్రీ గంగానగర్, బికనీర్, నాగౌర్, దిద్వానా–కుఛమాన్, ఆల్వార్, సికార్‌లలో తుపాను బీభత్సం సృష్టించింది. ‘‘ఇంతటి ఇసుక తుపాను జీవితంలో చూడలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఒక్కసారిగా నగరంలో చీకట్లు కమ్ముకున్నాయి’’అని ఛురు నగర వాసి చెప్పారు. దుమ్ము తుపాన్లతోపాటు ఉరుములతో కూడి వర్షాలు పడ్డాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ధోల్‌పూర్ జిల్లాలోని బారీలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీ సెల్సియస్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.


