
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను మిక్సింగ్ పద్ధతిలో ఇచ్చి ఫలితాలను విశ్లేసించేందుకు ఉద్దేశించిన ఓ పరిశోధనకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ), వెళ్లూర్ ఈ పరిశోధనలకు వేదిక కానుంది. దాదాపు 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఈ పరిశోధన జరగనుంది.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నిపుణులు బృందం జూలై 29న ఈ అనుమతులు జారీచేసింది. పరిశోధనలో భాగంగా వాలంటీర్లకు ఒక డోసు కోవిషీల్డ్, మరో డోసు కొవాగ్జిన్ ఇవ్వనున్నారు. ఇటీవలే ఐసీఎంఆర్ కూడా ఇలాంటి ఓ పరిశోధన చేసింది. మొత్తం 98 మందిపై జరిపిన ఆ మిక్సింగ్ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తేలింది. ఒకే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం కంటే రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ డోసులను ఒక్కొక్కటిగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు తెలిసింది. అంతేగాక కోవిషీల్డ్, కొవాగ్జిన్‌ల మిక్సింగ్ సురక్షితమేనని రుజువైంది.