ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురికి అధికవేడి ఒత్తిడి
266 జిల్లాల్లో అత్యధిక, 151 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు
40 ఏళ్లలో ఉష్ణోగ్రత పెరుగుదల తీరుపై సీఈఈడబ్ల్యూ అధ్యయనం
న్యూఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వి రాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) మనదేశంలో (1982–2022 మధ్య) 40 ఏళ్ల వాతావరణ గణాంకాలను విశ్లేషించి ఏ జిల్లా హీట్ రిస్క్ ఇండెక్స్ ఎంతో లెక్కగట్టింది. ఈ అధ్యయనం ప్రకారం..మన దేశంలోని అప్పటికి ఉన్న 734 జిల్లాలకుగాను 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును, 151 జిల్లాలు అధిక వేడి ముప్పును ఎదుర్కొన్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
అధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్న తొలి పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు: ఢిల్లీ, ఆంధ్రపదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్.
ఏపీతో పోల్చితే తెలంగాణ నయం
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సీజన్‌లో ఎండల తీవ్రత ఏఏ జిల్లాల్లో ఎంత ఎక్కువగా ఉందో మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని దశాబ్దాల వాతావరణ గణాంకాల ప్రకారం ఏఏ జిల్లాల హీట్ రిస్క్ స్కోర్ ఎంత చూస్తే...
⇒ తెలంగాణలోని 33 జిల్లాల్లో 9 జిల్లాలు (జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల) అత్యధిక’హీట్ రిస్క్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాలు అధిక రిస్క్ లో, మిగతా 10 జిల్లాలు మోస్తరు వేడి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
⇒ ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి 5 జిల్లాలు (ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం) అత్యధిక హీట్ రిస్క్ లో ఉంటే, మిగతా ఉమ్మడి 8 జిల్లాలు అధిక హీట్ రిస్క్ లో ఉన్నాయి.
– (సాక్షి, స్పెషల్ డెస్క్ )


